గోపాల్‌పేట శివారులో పుష్కలంగా నీరు పోస్తున్న బోరు
గోపాల్‌పేట : జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్‌ఐ) జలాలు పుష్కలంగా పారుతున్నాయి. కరువు నేలకు జలసవ్వడి సంతరించుకుంది. యాసంగిలో వేరుశనగ, వరి సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న 24గంటల కరెంట్ కూడా మరింత దోహదపడింది. కేఎల్‌ఐ జలాలు గోపాల్‌పేట, రేవల్లి, పాన్‌గల్, ఖిల్లాఘనపురం మండలాలకు ఉరకలెత్తుతున్నాయి. ఇప్పటికే సుమారు 60చెరువులు, కుంటలు నీటితో నిండాయి. మరికొన్ని ప్రాంతాల్లో భీమా సాగునీటి ఆధారంగా వరి సాగు విస్తీర్ణం పెరిగింది. జనవరి 31వరకే వరినాట్లు వేసేందుకు గడువు ముగిసింది. ఇప్పటివరకు 22,400ఎకరాల్లో వరిసాట్లు చేశారు. సాధారణ విస్తీర్ణం 23,300 ఎకరాలు కాగా, 33వేల ఎకరాలకు పెరగవచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 35,115 ఎకరాల్లో వరి సాగుచేయగా ఇప్పుడు అదనంగా మూడువేల ఎకరాలు పెరుగుతుందని చెబుతున్నారు.
నిరంతర విద్యుత్ తోడు
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తుంది. గతంలో ఇచ్చే 9గంటల కరెంట్ కోసం రాత్రింబవళ్లు పొలాల వద్ద పడిగాపులుగాసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డారు. కానీ ఆటోమెటిక్ స్టార్టర్లను తొలగించకపోవడంతో బోర్లపై భారం పడింది. దీనిపై ట్రాన్స్‌కో అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది.
పుష్కలంగా నీళ్లు
కుంట కింద వరిసాగు చేశాను. గతేడాది కుంటకు నీళ్లు రాకపోవడంతో శిస్తు చేయలేదు. ఈ సారి కేఎల్‌ఐ నీళ్లు రావడంతో నాట్లు వేశాను. బోరు ఆపకుండా నీళ్లు పోస్తుంది. -కృష్ణనాయక్, గోపాల్‌పేట రైతు
సూచనలు పాటించాలి
రబీలో నాట్లు వేసుకునే గడువు జనవరి 31తో ముగిసింది. అయినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరినాట్లు వేస్తున్నారు. ఇప్పటికే 22,400ఎకరాల్లో తెలంగాణ సోనా, బతుకమ్మ, 1010రకం సాగుచేశారు. ఇది కాస్తా 38వేల ఎకరాల వరకు చేరుతుంది. ఆలస్యంగా సాగుచేస్తే పంటలకు ఎండాకాలంలో నీటి సమస్య, తెగుళ్లు సోకే ప్రమాదం ఉంది. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలి.– నూతన్‌కుమార్, టెక్నికల్ ఏడీఏ వనపర్తి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment