హైకోర్టును విభజించాల్సిందే
ముక్తకంఠంతో అఖిలపక్షం డిమాండ్
దీనిపై ప్రధాని, సీజేఐ తదితరులకు విజ్ఞప్తి చేయాలని తీర్మానం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టును వెంటనే విభజించాలని అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్షం ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం టీఎన్జీవో భవన్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ నేతలు పాల్గొన్నారు. ఇక నుంచి న్యాయవాదులు చేపట్టే ఆందోళనల్లో పాల్గొంటామని, హైకోర్టు విభజన జరిగే వరకూ కలసికట్టుగా ఉద్యమిస్తామన్నారు.
విభజన జరిగే వరకూ న్యాయవ్యవస్థలో నియామకాలు చేపట్టరాదని డిమాండ్ చేశారు. హైకోర్టు విభజన కోసం ప్రధాని మోదీతోపాటు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) హెచ్ఎల్.దత్తు, హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, గవర్నర్ నరసింహన్, ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులను కలసి విజ్ఞప్తి చేయాలని అఖిలపక్షం తీర్మానించింది.
ఈ సందర్భంగా టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ న్యాయవ్యవస్థ నియామకాల్లో తెలంగాణకు ఇప్పటికే తీవ్ర అన్యాయం జరిగిందని.. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయకుండా న్యాయమూర్తుల నియామకాలు చేపడితే మరోసారి అన్యా యం జరుగుతుందన్నారు. హైకోర్టు విభజన కోసం ప్రజలు, ప్రజాసంఘాల నేతలు ఆందోళనల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ కోరారు.
అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ హైకోర్టు ఏర్పాటు విషయంలో గవర్నర్ నరసింహన్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, హైకోర్టు విభజన కోసం న్యాయవాదులు చేస్తున్న డిమాండ్‌కు తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి తెలిపారు. సమావేశంలో న్యాయవాదుల జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి, జేఏసీ నేతలు గండ్ర మోహన్‌రావు, శ్రీరంగారావు, కొండారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సీపీఐ మాజీ ఎంపీ అజీజ్ పాషా, సీపీఎం నేత మల్లారెడ్డి, టీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నేతలు రాజశేఖర్‌రెడ్డి, నాయక్ తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు విభజనతోనే సంపూర్ణ తెలంగాణ
హైకోర్టు విభజనతోనే సంపూర్ణ తెలంగాణ సాధ్యమవుతుందని న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి అన్నారు. హైకోర్టు విభజన జరగకపోవడంతో న్యాయశాఖకు చెందిన వేలాది మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, నియామకాల్లోనూ అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు విభజనలో ఆలస్యం జరిగితే న్యాయశాఖ ఉద్యోగులు సమ్మెకు దిగేందుకు కూడా వెనుకాడరని స్పష్టం చేశారు.