kalyan jyothisen gupta
-
ఆలయాల పాలకమండళ్ల పదవీ కాలం తగ్గింపుపై..
సర్కారుకు హైకోర్టు నోటీసులు సాక్షి, హైదరాబాద్: దేవాలయాల పాలకమండళ్ల పదవీకాలాన్ని రెండేళ్ల నుంచి ఏడాదికి తగ్గిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌పై యథాతథస్థితి (స్టేటస్కో)ని కొనసాగించాలని హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాల పాలకమండళ్ల కాలవ్యవధిని ఏడాదికి తగ్గిస్తూ దేవాదాయ, ధార్మిక సంస్థల చట్టానికి సవరణలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 1న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలు దేవస్థానాల చైర్మన్లు, ట్రస్టీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కుదింపు నోటిఫికేషన్‌పై యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
లోక్ అదాలత్ లో సత్వర న్యాయం
మెదక్: లోక్ అదాలత్‌ల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించవచ్చని, ఈ విషయాన్ని పోలీసులు గుర్తించి, ఆ దిశగా కృషి చేయాలని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతిసేన్‌గుప్త సూచించారు. శుక్రవారం సాయంత్రం మెదక్ పట్టణంలో కోర్టు భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేసిన ఆయన అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులతో తీర్పులు కాస్తా ఆలస్యమవుతున్నాయన్నారు. రాజీ చేయదగ్గ కేసులను లోక్ అదాలత్‌కు పంపడం ద్వారా ఇరు వర్గాలకు సంతోషకరమైన పరిష్కారం లభిస్తుందన్నారు. జూనియర్ న్యాయవాదులు కఠినమైన శ్రమచేస్తే ప్రతిభగల న్యాయవాదులుగా నిలదొక్కుకుంటారని చెప్పారు. నిరంతరం చట్టాలను అవలోకనం చేయాలన్నారు. మెదక్ పట్టణంలో 94 ఏళ్ల క్రితమే న్యాయస్థానం ఏర్పాటు చే శారని, ఇప్పటికీ కొన్ని మెట్రో నగరాల్లో న్యాయస్థానాలు లేవని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి కోర్టు భవనాన్ని ప్రారంభించడం తన జీవితాంతం గుర్తుంటుందన్నారు. కోర్టులో ఉన్న సమస్యలను తీర్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ, తాను జిల్లా వాస్తవ్యున్ని కావడంతో మెదక్ పట్టణంలో కోర్టు భవనం నిర్మించేందుకు కాస్తా ఎక్కువ శ్రద్ధ చూపానన్నారు. సివిల్ కేసుల్లో తీర్పులు కాస్త ఆలస్యమవుతున్నాయన్నారు. ముఖ్యంగా భార్యభర్తల కేసులు కొలిక్కి వచ్చేసరికి వారి వయస్సు 40 దాటుతుందన్నారు. మెదక్ కోర్టులో అపరిష్కృత కేసుల సంఖ్య తక్కువ ఉండటం సంతోషకరమన్నారు. హైకోర్టు న్యాయమూర్తి, మెదక్ పోర్ట్ ఫోలియో జడ్జి బి.శివశంకర్‌రావు మాట్లాడుతూ, సామాజిక విలువలు పెంపొందించడం, ఆదర్శ సమాజాన్ని రూపొందించడం న్యాయ విభాగం బాధ్యత అన్నారు. కోర్టు అనే దేవాలయంలో న్యాయం దేవుడన్నారు. మార్పులేనిదే సమాజం అభివృద్ధి కాదన్నారు. జిల్లా మొదటి అదనపు సెషన్ జడ్జి జి.రాధారాణి మాట్లాడుతూ, మెతుకుసీమలో 5 కోర్టులు ఉండటం సంతోషకరమన్నారు. మెదక్ కోర్టు నూతన భవనం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషకరమన్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ, కోర్టు ప్రాంగణంలో సోలార్ ఎనర్జీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఫర్నీచర్, ఈ-లైబ్రరీ, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో 8వ అదనపు జిల్లా జడ్జి వెంకట రమణరాయలు, సీనియర్ సివిల్ జడ్జి చంద్రశేఖర ప్రసాద్, వివిధ కోర్టుల జడ్జిలు, జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, డీఎఫ్ఓ సోనిబాల, ఆర్డీఓ వనజాదేవి, పీపీలు, బార్అసోసియేషన్ ప్రెసిడెంట్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. సీఎస్ఐ చర్చిలోహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రార్థనలు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్త, చిత్రసేన్‌గుప్త దంపతులు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కోర్టు భవన ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, బార్ అసోసియేషన్ సభ్యులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులను శాలువలు, మెమోంటోలతో సత్కరించారు. -
భద్రతలో నేవీది కీలకపాత్ర
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా సాక్షి, హైదరాబాద్: శత్రువుల నుంచి దేశాన్ని కంటికిరెప్పలా కాపాడడంలో భారత నావికాదళం కీలకపాత్ర పోషిస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా కొనియాడారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నావిళాదళం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోందని, యుద్ధవ్యూహాలు, శత్రుదేశాల కదలికల విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటోందని ప్రశంసించారు. నావికాదళ దినోత్సవం సందర్భంగా బుధవారం బొల్లారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జస్టిస్ గుప్తా ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. వ్యూహాత్మక యుద్ధరీతులను అభివృద్ధి చేసుకోవడంతో పాటు నౌకా వాణిజ్య రంగం పురోభివృద్ధికి, సముద్ర దొంగల కట్టడిలో నౌవికాదళం ముందుందని తెలిపారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో నేవీ కీలక పాత్ర పోషించిందని, చిన్న చిన్న నౌకలతో వ్యూహాత్మకంగా కరాచీ నౌకాశ్రయంపై దాడులు చేసి విజయం సాధించిందని చెప్పారు. ఆ యుద్ధం సమయంలో తాను కళాశాల విద్యార్థిగా ఉన్నానని, నావికాదళ విజయగాధను రేడియో ద్వారా విని సంబరాలు జరుపుకొన్నామన్నారు. దేశరక్షణ విషయంలో భూతలం కంటే సముద్ర స్థావరాల పరిరక్షణకే ప్రస్తుతం ప్రాబల్యం పెరిగిందని తెలిపారు. 1971 యుద్ధంలో విజయానికి ప్రతీకగా, అమరవీరుల సంస్మరణార్థం నావికాదళ దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తామని నేవీ హైదరాబాద్ విభాగం ఇన్ఛార్జ్, రియర్ అడ్మిరల్ కాళిదాస్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా నావికాదళ దినోత్సవం వారోత్సవాల బ్రోచర్‌ను జస్టిస్ గుప్తా ఆవిష్కరించారు. కార్యక్రమంలో నావికాదళం అధికారులు, 1971లో పాల్గొన్న నావికాదళం పూర్వ అధికారులు పాల్గొన్నారు. -
పరిష్కరించలేని సమస్యలేవీ ఉండవు : జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా
అనంతగిరి, న్యూస్‌లైన్: చట్టం పరిధిలో పరిష్కరించలేని సమస్యలంటూ ఏవీ ఉండవని, వాటి పరిష్కారానికి అవసరమైన చట్టాలపై న్యాయవాదులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరిగుట్ట పర్యాటక కేంద్రంలో రాష్ట్ర బార్ కౌన్సిల్, వికారాబాద్ బార్ కౌన్సిల్ల సంయుక్త ఆధ్వర్యంలో సివిల్, రెవెన్యూ, క్రిమినల్ చట్టాలు, ప్రాథమిక న్యాయసూత్రాలు తదితర అంశాలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ జస్టిస్ గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ...మనదేశంలో 26 శాతం మంది న్యాయపరమైన వివాదాల్లో ఉన్నా కేవలం 0.6 శాతం మంది మాత్రమే కోర్టులను ఆశ్రయిస్తున్నారన్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారాల వేదిక, లోక్ అదాలత్ వంటివి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రెవెన్యూ చట్టాలపై హైకోర్టు న్యాయమూర్తి ఎల్.నర్సింహారెడ్డి, క్రిమినల్ చట్టాలపై కె.సి.భాను న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బార్ కౌన్సిల్ సభ్యుడు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ.నర్సింహారెడ్డి, కార్యదర్శి రేణుక, ఉపాధ్యక్షుడు రాంరెడ్డి, జిల్లా జడ్జి ఎంఎస్కే జైస్వాల్ పాల్గొన్నారు.