
లోక్ అదాలత్ లో సత్వర న్యాయం
మెదక్: లోక్ అదాలత్‌ల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించవచ్చని, ఈ విషయాన్ని పోలీసులు గుర్తించి, ఆ దిశగా కృషి చేయాలని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతిసేన్‌గుప్త సూచించారు. శుక్రవారం సాయంత్రం మెదక్ పట్టణంలో కోర్టు భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేసిన ఆయన అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులతో తీర్పులు కాస్తా ఆలస్యమవుతున్నాయన్నారు. రాజీ చేయదగ్గ కేసులను లోక్ అదాలత్‌కు పంపడం ద్వారా ఇరు వర్గాలకు సంతోషకరమైన పరిష్కారం లభిస్తుందన్నారు. జూనియర్ న్యాయవాదులు కఠినమైన శ్రమచేస్తే ప్రతిభగల న్యాయవాదులుగా నిలదొక్కుకుంటారని చెప్పారు.
నిరంతరం చట్టాలను అవలోకనం చేయాలన్నారు. మెదక్ పట్టణంలో 94 ఏళ్ల క్రితమే న్యాయస్థానం ఏర్పాటు చే శారని, ఇప్పటికీ కొన్ని మెట్రో నగరాల్లో న్యాయస్థానాలు లేవని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి కోర్టు భవనాన్ని ప్రారంభించడం తన జీవితాంతం గుర్తుంటుందన్నారు. కోర్టులో ఉన్న సమస్యలను తీర్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ, తాను జిల్లా వాస్తవ్యున్ని కావడంతో మెదక్ పట్టణంలో కోర్టు భవనం నిర్మించేందుకు కాస్తా ఎక్కువ శ్రద్ధ చూపానన్నారు. సివిల్ కేసుల్లో తీర్పులు కాస్త ఆలస్యమవుతున్నాయన్నారు.
ముఖ్యంగా భార్యభర్తల కేసులు కొలిక్కి వచ్చేసరికి వారి వయస్సు 40 దాటుతుందన్నారు. మెదక్ కోర్టులో అపరిష్కృత కేసుల సంఖ్య తక్కువ ఉండటం సంతోషకరమన్నారు. హైకోర్టు న్యాయమూర్తి, మెదక్ పోర్ట్ ఫోలియో జడ్జి బి.శివశంకర్‌రావు మాట్లాడుతూ, సామాజిక విలువలు పెంపొందించడం, ఆదర్శ సమాజాన్ని రూపొందించడం న్యాయ విభాగం బాధ్యత అన్నారు. కోర్టు అనే దేవాలయంలో న్యాయం దేవుడన్నారు. మార్పులేనిదే సమాజం అభివృద్ధి కాదన్నారు. జిల్లా మొదటి అదనపు సెషన్ జడ్జి జి.రాధారాణి మాట్లాడుతూ, మెతుకుసీమలో 5 కోర్టులు ఉండటం సంతోషకరమన్నారు. మెదక్ కోర్టు నూతన భవనం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషకరమన్నారు.
బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ, కోర్టు ప్రాంగణంలో సోలార్ ఎనర్జీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఫర్నీచర్, ఈ-లైబ్రరీ, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో 8వ అదనపు జిల్లా జడ్జి వెంకట రమణరాయలు, సీనియర్ సివిల్ జడ్జి చంద్రశేఖర ప్రసాద్, వివిధ కోర్టుల జడ్జిలు, జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, డీఎఫ్‌ఓ సోనిబాల, ఆర్డీఓ వనజాదేవి, పీపీలు, బార్‌అసోసియేషన్ ప్రెసిడెంట్‌లు, న్యాయవాదులు పాల్గొన్నారు.
సీఎస్‌ఐ చర్చిలోహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రార్థనలు
ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్త, చిత్రసేన్‌గుప్త దంపతులు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కోర్టు భవన ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, బార్ అసోసియేషన్ సభ్యులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులను శాలువలు, మెమోంటోలతో సత్కరించారు.