
పరిష్కరించలేని సమస్యలేవీ ఉండవు : జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా
అనంతగిరి, న్యూస్‌లైన్: చట్టం పరిధిలో పరిష్కరించలేని సమస్యలంటూ ఏవీ ఉండవని, వాటి పరిష్కారానికి అవసరమైన చట్టాలపై న్యాయవాదులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరిగుట్ట పర్యాటక కేంద్రంలో రాష్ట్ర బార్ కౌన్సిల్, వికారాబాద్ బార్ కౌన్సిల్‌ల సంయుక్త ఆధ్వర్యంలో సివిల్, రెవెన్యూ, క్రిమినల్ చట్టాలు, ప్రాథమిక న్యాయసూత్రాలు తదితర అంశాలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ జస్టిస్ గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ...మనదేశంలో 26 శాతం మంది న్యాయపరమైన వివాదాల్లో ఉన్నా కేవలం 0.6 శాతం మంది మాత్రమే కోర్టులను ఆశ్రయిస్తున్నారన్నారని పేర్కొన్నారు.
ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారాల వేదిక, లోక్ అదాలత్ వంటివి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రెవెన్యూ చట్టాలపై హైకోర్టు న్యాయమూర్తి ఎల్.నర్సింహారెడ్డి, క్రిమినల్ చట్టాలపై కె.సి.భాను న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బార్ కౌన్సిల్ సభ్యుడు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ.నర్సింహారెడ్డి, కార్యదర్శి రేణుక, ఉపాధ్యక్షుడు రాంరెడ్డి, జిల్లా జడ్జి ఎంఎస్‌కే జైస్వాల్ పాల్గొన్నారు.