బీసీ.. గీసీ జాంతానై
కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్ : కళ్యాణదుర్గం టీడీపీలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. కాలువను బీసీ అభ్యర్థిగా కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యే బరిలో దింపుతారనే ప్రచారం ఊపందుకోవడంతో ఉన్నం వర్గీయులు అయోమయంలో పడ్డారు. కొంత కాలంగా జేసీ బ్రదర్స్ టీడీపీలోకి చేరుతారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడని ప్రచారంలోకి రావడమే కాకుండా 20 రోజుల పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆయన పర్యటించడం టీడీపీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. కాలవ శ్రీనివాసులకు కళ్యాణదుర్గం టికెట్ ఇవ్వనున్నారనే వార్తలు ఉన్నం వర్గీయులను కలవర పెట్టాయి. ‘బీసీ.. గీసీ జాంతానై.. నేనెంత సీనియరో తెలియదా.. నాసత్తా ఎంటో నాకు తెలుసు.. నాడు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయినప్పుడు అభ్యర్థిని గెలిపించుకున్నా.. మొన్న పంచాయతీ స్థానాల్లో అత్యధికం గెలిపించుకోలేదా.. నేరుగా చంద్రబాబుతోనే మాట్లాడి తేల్చుకుంటా..’ అని అని ఆపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉన్నం హనుమంతరాయ చౌదరి పార్టీ శ్రేణుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇక్కడి పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తున్నాయి. పార్టీ ‘ఉన్నం’ను కాకుండా మరో నేతను ఇక్కడి నుంచి బరిలోకి దింపితే సహకరించే పరిస్థితి లేదు. ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో సైతం ఇదే చర్చ జరుగుతోంది. కాగా పార్టీలోని కొందరు బీసీ నేతలు మాత్రం.. కాలవకు టికెట్ ఇస్తేనే బావుంటుందని చెబుతున్నారు. బీసీ ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తేనే గెలుపుపై అవకాశాలు ఉంటాయని వారు వాదిస్తున్నారు. లేదంటే పార్టీలో ఉన్న బీసీ కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం ఖాయమనే హెచ్చరికలు సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ ఎవరికి దక్కుతుందోనని కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.