తిరుమలలో పెళ్లిళ్లకు కొత్త ‘కల్యాణ’ స్కీం
♦ ఆన్లైన్లోనూ కల్యాణ వేదిక బుకింగ్
♦ టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు వెల్లడి
సాక్షి, తిరుమల: తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే భక్తులకు కొత్తగా స్కీం ప్రారంభిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు. గురువారం రాత్రి ఆయన కల్యాణవేదికలో సామూహిక వివాహ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమలలోని టీటీడీ పౌరోహిత సంఘం కల్యాణవేదికలో ఏటా సుమారు 5వేలకు పైగా వివాహాలు జరుతున్నాయని, వీటి నిర్వహణకోసం కొత్తగా ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇందులో భాగంగానే గది, అన్నప్రసాదం, పెళ్లి రిజిస్ట్రేషన్, లడ్డూ ప్రసాదాలు వంటి సౌకర్యాలు కొత్త స్కీములో కల్పిస్తామన్నారు. భక్తులు సులభంగా, సౌకర్యవంతంగా తిరుమలలో పెళ్లి చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. అవసరమైతే పెళ్లికి అవసరమైన పూజా సామగ్రి కూడా టీటీడీనే సమకూర్చే విషయంలో సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తామన్నారు.