కమనీయం...పట్టాభిరాముని కల్యాణం
వాల్మీకిపురం, న్యూస్‌లైన్: వాల్మీకిపురంలో పట్టాభిరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. సుప్రభాతసేవతో స్వామిని మేల్కొలి పారు. మూలవర్లకు అభిషేకం, తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. తిరుచ్చిలో స్వామివారిని అలంకరించి తిరుమాడవీధుల్లో శాస్త్రోక్తంగా ఊరేగించారు. అనంతరం వేదపండితులు స్నపనతిరుమంజనం, ఊంజల్‌సేవ నిర్వహించారు.
తరువాత సీతాలక్ష్మణ సమేత పట్టాభిరాముల వారిని కల్యాణోత్సవానికి ముస్తాబు చేశారు. మంగళవాయిద్యాలతో ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తోట వీధిలోని కల్యాణ వేదిక కు తీసుకొచ్చారు. టీటీడీ వేదపండితులు అనంతవెంకటదీక్షితులు, ఆలయ ప్రధాన అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో కల్యాణం కమనీయం గా జరిపించారు. ఈ ఉత్సవాన్ని వేలాది మంది భక్తులు తిలకించి పులకించిపోయారు.
తరువాత స్వామి, అమ్మవార్లను గరుడవాహనంపై ఊరేగించారు. టీటీడీ ఈవో గోపాల్, జేఈవో పోలా భాస్కర్, డెప్యూటీ ఈవో శ్రీధర్, ఏఈవో ధనుంజయ, ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కల్యాణోత్సవ వేదిక వద్ద గురువారం రాత్రి తోటవీధి వినాయక ఉత్సవ కమిటీ, అశ్విని కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. వాల్మీకిపురానికి చెందిన బిల్డర్ ఫణికుమార్, రాఘవేంద్రరావు మజ్జిగ, తాగునీరు సరఫరా చేశారు.