కామధేనువుపై వరసిద్ధుడు
కాణిపాకం(ఐరాల):
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి కామధేను వాహనంపై ఉభయదేవేరులతో విహరిస్తూ వినాయకస్వామి భక్తులను ఆశీర్వదించారు. ఉదయం ఆలయంలో మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేక పూజలు, అలంకరణలు జరిగాయి. ఉదయం నుంచి ఆలయం లో రద్దీ కనిపించింది. రాత్రి 10–30 గంటలకు అన్వేటి మండపంలో సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను పరిమళభరిత పుష్పమాలికలు, పట్టుపీతాంబరాలు, విశేషాభరణాలతో అలంకరించారు. ధూపదీప నైవేద్యాల అనంతరం తీర్థప్రసాదాలను వినియోగం జరిగింది. తర్వాత ఉత్సవమూర్తులను కామధేను వాహనంపై ఆశీనులను చేసి మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆలయ ఈఓ పూర్ణచంద్రరావు, ఏసీ వెంకటేషు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్రబాబు, అధికారులు చిట్టిబాబు, మల్లికార్జున, ఉభయదారులు పాల్గొన్నారు. అస్థాన మండపంలో జరిగిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి.