kamakoti
-
చాయిస్ ఫిల్లింగ్‌లో అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో నిర్వహించే ‘జోసా’ ప్రక్రియలో జేఈఈ అడ్వాన్స్డ్ ఉత్తీర్ణులు తమ చాయిస్ ఫిల్లింగ్, ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల ప్రాథమ్యాల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఐఐటీ–మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి సూచించారు. వందల సంఖ్యలో ఆప్షన్స్ ఇచ్చే అవకాశమున్నందున చిన్న పొరపాటు కూడా భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారవచ్చునని హెచ్చరించారు. ఈ నెల 11న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల, ఆ మర్నాడే ‘జోసా’ ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులు ‘ఆస్క్ ఐఐటీఎం’ పేరుతో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో కామకోటి పాల్గొన్నారు. వారి సందేహాలు నివృత్తి చేశారు. ఐఐటీ మద్రాస్ విశిష్టతలను వివరించారు. ఇష్టమైన సబ్జెక్టులు ఎంచుకోవచ్చు ప్రస్తుతం ఇంటర్ డిసిప్లినరీ విధానంలో ఐఐటీ మద్రాస్‌లో బీటెక్‌లో ఏ బ్రాంచ్ విద్యార్థులైనా.. కోర్ సబ్జెక్ట్‌లతోపాటు తమకు ఆసక్తి ఉన్న ఇతర సబ్జెక్ట్‌లను చదివే అవకాశం ఉందని.. వీటిలో పొందిన క్రెడిట్స్‌ను సైతం బీటెక్ ప్రోగ్రామ్‌కు కలుపుతారని కామకోటి తెలిపారు. ఫలితంగా తమ ర్యాంకుకు వచ్చిన బ్రాంచ్‌తో తృప్తిపడకుండా ఇష్టమైన సబ్జెక్ట్‌లు చదివే అవకాశం విద్యార్థులకు లభిస్తుందన్నారు. ఇంటిగ్రేటెడ్ పీజీ (బీటెక్+ఎంటెక్) ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులు నాలుగో సెమిçÜ్టర్‌లో తమకు ఆసక్తిఉన్న వేరే బ్రాంచ్‌కు బదిలీ అయ్యే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఇంజనీరింగ్ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా.. వైద్య రంగానికి అవసరమైన టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. వైద్య అనుబంధ అంశాలకు సంబంధించి ప్రత్యేక విభాగాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. వాస్తవ పరిస్థితులను పరిగణిస్తూ బోధన, కరిక్యులం, పరిశోధనల విషయంలో ఎప్పటికొప్పుడు మార్పులు, చేర్పులు చేపడుతున్నామని సృజనాత్మకతకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అన్ని రకాల అవకాశాలు, సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చర్యల ఫలితంగానే ఐఐటీ మద్రాస్ ఏడేళ్లుగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో కొనసాగుతోందన్నారు. విద్యార్థులకు మంచి ప్లేస్మెంట్లూ దక్కుతున్నాయని కామకోటి చెప్పారు. 2021–22 విద్యా సంవత్సరంలో మొత్తం విద్యార్థుల్లో 80 శాతం మందికి ప్లేస్మెంట్ ఆఫర్స్ లభించాయని, మొత్తం 1,199 మందికి ఆఫర్లు లభించగా అందులో 45 మందికి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు వచ్చాయని తెలిపారు. 25 శాతం మేర తెలుగు విద్యార్థులే ఐఐటీ మద్రాస్‌లో తెలుగు విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉందని, అన్ని విభాగాలను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 25 శాతం మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారని ప్రొఫెసర్ కామకోటి తెలిపారు. అన్ని రంగాల్లోనూ మంచి అవకాశాలు ‘ప్రస్తుత తరం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కెరీర్ అంటే ఇంజనీరింగ్, అందుకు ఐఐటీలే మేలు మార్గమని అనే భావన నెలకొంది. అయితే ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ అవకాశాలు బాగానే ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల సహజ ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా ఇతర కోర్సులకూ ప్రాధాన్యమివ్వాలి. ఐఐటీలో సీటు రాకపోతే భవిష్యత్తు లేదన్న ఆందోళన అర్థరహితం. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తి ఏంటో తెలుసుకోకుండానే వారిని బీటెక్, కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరేలా ఒత్తిడి చేస్తున్నారు. ఇది సరికాదు’ అని కామకోటి అన్నారు. ఆన్లైన్ కోర్సులను అందిపుచ్చుకోవాలి ‘ఐఐటీలో చేరే అవకాశం కోల్పోయిన విద్యార్థులు ఆన్లైన్ కోర్సుల అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం ఎన్పీటీఈఎల్ పోర్టల్ ద్వారా ఐఐటీ ప్రొఫెసర్ల లెక్చర్లు వేల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ తరగతి గదిలో చెప్పిన అంశాలు యథాతథంగా ఉంటాయి. వీటిని అనుసరించడం ఫలితంగా నిపుణులైన ప్రొఫెసర్ల లెక్చర్లు విని తమ సబ్జెక్ట్‌లలో నైపుణ్యం పెంచుకునే అవకాశం లభిస్తుంది’ అని కామకోటి సూచించారు. రెండేళ్లుగా జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఐఐటీలపై క్రేజ్ తగ్గుతోందనే అభిప్రాయం సరికాదని అన్నారు. పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరైన ఈ సదస్సులో కామకోటితోపాటు ఐఐఎం–ఎం అలూమ్నీ అండ్ కార్పొరేట్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ మహేశ్ పంచాజ్ఞుల, ఆస్క్ ఐఐటీఎం ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
మనిషి మూడు రకాల రుణాలతో జన్మిస్తాడు
శంకర విజయేంద్ర సరస్వతి రాజమహేంద్రవరం కల్చరల్ : ప్రతి మనిషి దేవరుణం, రుషి రుణం, పితృరుణం అనే మూడు రకాల అప్పులతో జన్మిస్తాడని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్రసరస్వతి అన్నారు. రాజమహేంద్రవరం నగరంలోని నందం గనిరాజు సెంటరులో కందుకూరి శివానందమూర్తి సత్సంగం ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. తపస్సు ద్వారా దేవతల రుణాన్ని, వేదాధ్యయనం ద్వారా రుషి రుణాన్ని, సంతానం ద్వారా పితృరుణాన్ని తీర్చుకోవాలన్నారు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే తాపత్రాయాలతో మనిషి జీవితం గడుపుతాడు కానీ, సత్సంగాన్ని మనిషి అలవరుచుకోవాలని హితవు చెప్పారు. ఆత్మనియంత్రణ, ఆత్మపరిశోధన చాలా అవసమని, ఆత్మానుభూతి కలిగితే, ఇక లోకంతో పని ఉండదన్నారు. సర్వసంగ పరిత్యాగం అందరికీ కుదరదని, దేశభక్తి, దైవభక్తి, సంస్కృతభాషాభిమానం, సదాచారంపై ఆసక్తి తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. సత్సంగం నిర్వాహకులు వాడ్రేవు మల్లపరాజు దంపతులు, వాడ్రేవు వేణుగోపాల్ దంపతులు, ప్రముఖ ఆడిటర్ వి.భాస్కరరామ్, డాక్టర్ టీవీ నారాయణరావు, ప్రముఖ న్యాయవాది మామిడన్న శేషగిరిరావు పాల్గొన్నారు. వేద విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన వేదవిద్యార్థులతో శంకర విజయేంద్ర సరస్వతి ముఖాముఖి మాట్లాడారు. అగ్నికార్యమంత్రాలు విద్యార్థులు చదువుతుంటే ఆసక్తిగా విన్నారు. మేధావీ భూయాసం, తేజస్వీభూయాసం ఇత్యాదులను పలుకుతున్నప్పుడు, వేళ్లతో శిరస్సును, ఇతర అంగాలను ఎలా తాకాలో చూపించారు.