Kamala Nehru Mother and Child Hospital
-
ఐసీయూలో అగ్ని ప్రమాదం.. నలుగురు చిన్నారులు సజీవ దహనం
భోపాల్: మధ్యప్రదేశ్లో పెను విషాదం చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారులు అగ్నికి ఆహుతి అయ్యారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఉన్న కమలా నెహ్రూ ఆస్పత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. పీడియాట్రిక్స్ ఐసీయూ వార్డులో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన చోటు చేసుకున్న సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. 36 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని 25 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. (చదవండి: అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం..) ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ‘‘కమలా నెహ్రూ ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాను. ఏసీఎస్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మహ్మద్ సులేమాన్ పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతుంది’’ అన్నారు. (చదవండి: ‘జోకర్’ బీభత్సం: రైల్లో మంటలు.. 10 మందికి గాయాలు) ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చామని.. అయితే అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన కొందరు చిన్నారులను రక్షించలేకపోయామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మూడో అంతస్తులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. చదవండి: రూ.90 కోట్ల విలువైన మద్యం దగ్ధం -
సరిగ్గా ఐదు నెలలకు కథ సుఖాంతం
షిమ్లా: ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం కారణంగా కాన్పు సమయంలో జరిగిన చిన్న పొరపాటుతో ఇద్దరు తల్లుల పిల్లలు తారుమారయ్యారు. అయితే ఐదు నెలలపాటు ఆ చిన్నారుల పేరేంట్స్ చేసిన కృషి ఫలించింది. చివరికి కథ సుఖాంతమైంది. ఆ వివరాలిలా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలోని కమలా నెహ్రూ జననీ, శిశు సంరక్షణ ఆస్పత్రికి దాదాపు ఐదు నెలల కిందట సరిగ్గా మే 26న ఇద్దరు గర్భవతులు వచ్చారు. అందులో ఓ జంటకు బాబు, మరో జంటకు పాప పుట్టింది. కానీ ఎక్కడో లోపం జరిగింది. చిన్నారులు తల్లి నుంచి తారుమారయ్యారు. అయితే తమ వద్ద ఉన్నది వేరొకరి సంతానమని తెలుసుకున్న వీరి తల్లిదండ్రులు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 21న హైకోర్టు ఆదేశాల మేరకు డీఎన్ఏ టెస్టులు చేసి బిడ్డలు మారిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ 26లోగా వారి వివరాలు తెలుసుకుని చిన్నారులను వారి అసలైన పేరేంట్స్ కు అందించాలని హైకోర్టు ఆ ఆస్పత్రికి చెప్పింది. ఖాలిని ఏరియాలో ఉండే జంటకు, అంజనా ఠాకూర్ అనే స్టాఫ్ నర్స్ దంపతులకు ఆస్పత్రికి రావాలని కబురందింది. నిన్న (బుధవారం) అంజనా వద్ద ఉన్న బాబును ఖాలిని ఏరియా దంపతులకు ఇచ్చి, వారి వద్ద పెరుగుతున్న బాలికను నర్స్ దంపతులకు అప్పజెప్పారు. మే 26(పుట్టినరోజు)న తమ నుంచి వేరయిన తమ పాప సరిగ్గా ఐదు నెలల కిందట ఆక్టోబర్ 26న తమ చెంతకు చేరడంతో అంజనా ఎంతో సంతోషంగా ఉందన్నారు. బిడ్డల తారుమారు ఘటనపై దోషులెవరో కనుక్కొని శిక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.