అర్చనకు అవార్డు ఖాయం
‘‘ఈ సినిమా బాగా రావడానికి దర్శకుడు ఎంతో తపించారు. కొన్ని సన్నివేశాల్లో నటించడానికి అర్చన చాలా ఇబ్బంది పడింది. అయినా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఎటువంటి రాజకీయాలు జరగకపోతే, ఈ సినిమాతో అర్చనకు అవార్డు ఖాయం’’ అని శివాజి చెప్పారు. శివాజి, అర్చన జంటగా నరసింహ నంది దర్శకత్వంలో ఇసనాక సునీల్‌రెడ్డి, సిద్దార్థ బోగోలు నిర్మిస్తున్న ‘కమలతో నా ప్రయాణం’ ప్రచార చిత్రాల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ‘‘అర్చన లాంటి ప్రతిభావంతమైన నాయికలు తెలుగులో చాలామంది ఉన్నారు.
వారికి అవకాశాలు రావట్లేదు. మనం కూడా ఇవ్వట్లేదు. ఉత్తరాది వారిని కాకుండా తెలుగువారిని ప్రోత్సహించే ధోరణి రావాలి’’ అని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ఇందులో శివాజీ అభినయం చూస్తే ‘ఇద్దరమ్మాయిలు’ చిత్రంలో ఏయన్నార్ పాత్ర గుర్తుకొచ్చిందని బి.గోపాల్ పేర్కొన్నారు. ఇందులో బోల్డ్ సీన్స్ చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డానని అర్చన తెలిపారు. షూటింగ్ మొత్తం పూర్తయిందని, త్వరలో పాటలను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరు వెంకటరెడ్డి, హరిశ్చంద్రప్రసాద్, కేకే, మురళీమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.