రసాభాస
నకిరేకల్, న్యూస్‌లైన్: నకిరేకల్‌ను నగర పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభ రసాభాసగా మారింది. సభకు డీఎల్పీఓ యాదయ్య, ఎంపీడీఓ కత్తుల సత్తెమ్మ, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, ఈఓఆర్డీ కమలాకర్‌రావు, పంచాయతీ ఇన్చార్జ్ కార్యదర్శి చంద్రశేఖర్‌లు హాజ రయ్యారు. నకిరేకల్‌ను గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని ప్రజలు
డిమాండ్ చేశారు. అయితే, స్థానిక పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితో పాటు మరికొంతమంది నాయకులు నగర పంచాయతీగా కొనసాగించాలని పట్టుబట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
గామ పంచాయతీ కావాలంటున్న ప్రజలంతా ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారని, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవద్దని మరోవర్గం నినాదాల చేయడంతో ఆ రెండువర్గాల మధ్య ఘర్షణ జరి గింది. ఈ సంఘటనలో పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు గాయపడ్డారు. నకిరేకల్ సీఐ శ్రీనివాసరావు, నకిరేకల్, కేతేపల్లి ఎస్ఐలు ప్రసాదరావు, శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రంగప్రవేశం చేసి ఇరువర్గాలను పక్కకు తోసే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు.
గంటపాటు ఇరువర్గాల మధ్య గందరగోళం నెలకొంది. దీంతో ప్రత్యేక అధికారి కమలాకర్‌రావు నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ కోసం ఇరువర్గాల నుంచి వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించామని, వారి అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకుంటున్నామని ప్రకటించి వెళ్లిపోతున్న అధికారులు వెళ్తుండగా ఆందోళనకారులు వారిని అడ్డగించారు. వెంటనే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి అధికారులను పంపించారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా
నకిరేకల్‌పై ప్రజాభిప్రాయ సేకరణలో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో పట్టణంలోని మూసి రోడ్డులో ఉంటున్న బంటు రేణుక, వనం భవానీలు గాయపడ్డారు. పారి శుద్ధ్య సిబ్బంది కావాలనే గ్రామ పంచాయతీ కోసం డిమాండ్ చేస్తున్న తమపై దాడి చేసి గాయపరిచారని పోలీస్ స్టేషన్ ఎదుట వారు ధర్నా చేశారు. తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.