breaking news
kamalapuram - kazipet
-
పరీక్షకు వెళ్లొస్తూ.. వంకలో కొట్టుకుపోయిన దంపతులు
సాక్షి, కమలాపురం : కమలాపురం–ఖాజీపేట రహదారిలో పాగేరు వంతెనపై ద్విచక్ర వాహనంలో వెళుతూ నీటి ఉధృతికి దంపతులు గల్లంతయ్యారు. స్థానికులు గమనించి భార్యను రక్షించి బయటకు తీశారు. భర్త ఆచూకీ లభించలేదు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు... మండలంలోని చిన్న చెప్పలికి చెందిన శరత్ చంద్రారెడ్డికి కడపకు చెందిన ఐశ్వర్యతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారు కడపలోనే నివాసం ఉంటున్నారు. శరత్ చంద్రారెడ్డి కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పీఆర్ఓగా పని చేస్తున్నాడు. గురువారం ఎడ్ సెట్ పరీక్ష రాసేందుకు ఐశ్వర్యను చాపాడుకు తీసుకెళ్లాడు. పరీక్ష ముగిసిన అనంతరం సాయంత్రం కమలాపురం మీదుగా స్వగ్రామం చిన్న చెప్పలికి ద్విచక్ర వాహనంలో బయలు దేరారు. పాగేరు వంకలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై కొంత దూరం రాగానే ప్రవాహ వేగానికి అదుపు తప్పడంతో ద్విచక్ర వాహనంతో పాటు భార్యా భర్తలిద్దరూ వరద నీటిలో కొట్టుకొని పోయారు. స్థానిక యువకుడు నీటిలో దూకి ఐశ్వర్యను రక్షించాడు. శరత్ చంద్రారెడ్డి అప్పటికే కనబడకుండా పోయాడు. తహసీల్దార్ విజయ్ కుమార్, ఎస్ఐ రాజారెడ్డి, ఎస్ఎఫ్ఓఓ నాగేశ్వర్ రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శిక్షణ పొందిన అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయినా శరత్ ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు ఆపివేశారు. తన భర్త కోసం కొండంత ఆశతో వంతెన ఒడ్డున ఐశ్వర్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటన చూసినవారు కంట తడి పెట్టారు. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు, ఏడు నెలల కుమార్తె ఉంది. -
కమలాపురం -ఖాజీపేట మధ్య నిలిచిన రాకపోకలు
కడప : వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం వద్ద గురువారం పాగేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాగులోని నీరు రహదారిపైకి భారీగా వచ్చి చేరింది. దాంతో కమలాపురం - ఖాజీపేటల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ వద్ద కుందరవాగు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి.