అక్కడేం జరుగుతోంది?
కామరకొండపై కార్పొరేట్ తరహా వ్యవసాయానికి ఏర్పాట్లు
అధికారులకు తెలియకుండానే పొక్లెయిన్లతో రహదారి ఏర్పాటు
పాత పట్టాల సాకుతో కబ్జాకు సిద్ధం
కాదేదీ కబ్జాకు అనర్హం అనడానికి ఇదో ప్రత్యక్ష సాక్ష్యం. కొండపైభాగాన ఉన్న భూమి సాగుకు అనుకూలంగా ఉండడంతో దానిపై కన్నేసిన పెద్దలు చకచకా అక్కడకు చేరుకొనేందుకు రోడ్డును వేసుకున్నారు. పదిహేను రోజులుగా ఆ పనులు జరుగుతున్నప్పటికీ అధికారులకు తెలియకపోవడం చెప్పుకోదగ్గ అంశం.
జగ్గంపేట :
సుమారు రెండు తాడుల ఎత్తున్న విశాలమైన కొండ అది. సుమారు 350 ఎకరాల విస్తీర్ణంగల ఈ కొండ పైభాగం చదునుగా ఉండడంతో దాన్ని ఆక్రమించుకొనేందుకు కొందరు పెద్దలు వ్యూహరచన చేశారు. అక్కడ కార్పొరేట్ తరహాల్లో సాగు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. ఆక్రమంలో ఈ కొండపై పొక్లెయిన్ల సహాయంతో 15 రోజులుగా పనులను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఈ విషయం తమకు తెలియదంటున్నారు అధికారులు. వివరాల్లోకి వెళితే జగ్గంపేట మండలంలో నరేంద్రపట్నం రెవెన్యూ పరిధిలో విశాలమైన కొండలు ఉన్నాయి. ఆయా కొండలను కొద్దిమంది కొండపోడుగా సాగుచేసుకుంటుంటారు. సుమారు 350 ఎకరాల విస్తీర్ణంగల విశాలమైన కామరకొండ నరేంద్రపట్నం రెవెన్యూ పరిధిలో ఉంది. ఇది అటు కాండ్రేగుల, ఇటు మన్యంవారిపాలెం, బావవరం తదితర గ్రామాలకు ఆనుకుని ఉంది. సుమారు రెండు కిలోమీటర్లు ఎక్కితేనే గాని కొండపైకి చేరుకోలేం. దానిపై కన్నేసిన కొందరు పెద్దలు పొక్లెయిన్ల సహాయంతో చకచకా రోడ్డును నిర్మించారు. కొండ పైభాగంలో సుమారు 200 ఎకరాల పైబడి చదునుగా ఉంది. మన్యంవారిపాలెం, బావవరం, గొల్లలగుంటకు చెందిన సుమారు 30 మంది గతంలో ఈ కొండపై పట్టాలు పొందినట్టు చెబుతున్నప్పటికీ వారి వద్ద సరైన ఆధారాలు కూడా ఉన్నట్టు లేవు. వారిలో కొందరు అక్కడ జీడిమామిడి, అపరాల మొక్కలను పెంచుతున్నారు. విలువైన ఈ భూమిపై కన్నేసిన కొందరు నాయకులు బినామీల పేర్లతో అసైన్డ్ పట్టాలు పొందేందుకు ముందుగా చదును చేసి సాగుకు దిగుతున్నట్టు సమాచారం. గంటకు రూ.1500కు పొక్లెయిన్లను ఉపయోగించి 15 రోజులపాటు కొండంతా చదును చేయించడం, రోడ్డు ఏర్పాటు చేయడం వెనుక ఏదో కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆక్రమణలను నిరోధించాలి
కామరకొండతోపాటు కాండ్రేగుల పరిధిలోని బోడుకొండ, మన్యంవారిపాలెం, గోవిందపురం పరిధిలోని కొండలపై సర్వే జరిపి అక్రమాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పనులు నిలుపుదల చేయించాం
కొండపై భూమిలో బావవరానికి చెందిన కొందరికి పట్టాలు ఉన్నట్టు తెలిసింది. కొండను చదును చేసి, రోడ్డు వేస్తున్నట్టు తెలియగానే ఆపనులను నిలుపుదల చేయించాం.
–శివమ్మ, తహసీల్దార్