దెయ్యాలతిప్పలో అపార గ్యాస్ నిక్షేపాల
ఓఎన్జీసీ జీఎం కామరాజు
భీమవరం :
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దెయ్యాలతిప్ప గ్రామంలో చమురు, సహజవాయు నిక్షేపాలు అపారంగా ఉన్నట్టు గుర్తించామని ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ (కేజీ బేసిన్) ఏవీవీఎస్ కామరాజు వెల్లడించారు. శుక్రవారం భీమవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. దెయ్యాలతిప్ప వద్ద రోజుకు 7 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను వెలికితీసే అవకాశం ఉందని చెప్పారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 22 ఉత్పాదక విభాగాలు, 8 డ్రిల్లింగ్ రిగ్గులు, ఒక మినీ రిఫైనరీ ద్వారా 700 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి భూగర్భం, భూమి మీదుగా రోజుకు 32 లక్షల క్యూబిక్ మీటర్ల సహజవాయువు, 850 టన్నుల ముడి చమురు ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. దేశం మొత్తం మీద ఆరు రాష్ట్రాల్లో సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించమన్నారు. 2020 నాటికి రూ.34 వేల కోట్ల ఖర్చుతో ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ కార్యకలాపాల ద్వారా 70 వేల బ్యారల్స్ ముడి చమురు ఉత్పత్తి కాగదని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. గ్యాస్, ఆయిల్ ఉత్పత్తి ద్వారా ప్రభుత్వానికి రాయల్టీ, సెస్ రూపంలో రూ.3,800 కోట్లు, సీఎస్ఆర్ ద్వారా రూ.9 కోట్లు చెల్లిస్తున్నామని కామరాజు చెప్పారు.