ఈ దాహం తీరనిది!
సాక్షి, నిజామాబాద్ : ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా తయారైంది కామారెడ్డి అధికార పార్టీ నేతలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల తీరు. ఇక్కడ భారీ తాగునీటి పథకం నిర్మాణానికి సర్కారు 140 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. వీటిని పూర్తి స్థాయిలో ఖర్చు చేశారు. కానీ, ఈ పనులతో పర్సెంటేజీల రూపంలో అధికార పార్టీ నేతలు, ఇంజనీరింగ్ అధికారుల ‘దాహం’ తీరిందే తప్ప, కామారెడ్డి ప్రాంతవాసులకు మాత్రం ఐదేళ్లుగా చుక్క నీరు అందలేదు. ట్రయల్ రన్ పూర్తయిందని గొప్పలు పోతున్న అధికారులు, నేతలు ఇప్పుటి వరకు ఖర్చు చేసిన నిధులు సరిపోవడం లేదని, తాగునీరు ప్రజల చెంతకు చేరాలంటే ఇంకా అదనంగా నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి సర్కారు నుంచి ఇప్పటి వరకు సమాధానం లేదు. అంటే రానున్న వేసవిలోగా కూడా ప్రజలకు ఈ పథకం ద్వారా తాగునీరు సరఫరా చేసే అవకాశాలు కనిపించడం లేదు.
ఇదీ పరిస్థితి
కామారెడ్డి పట్టణంతోపాటు, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, సదాశివనగర్, తాడ్వాయి మండలాల పరిధిలో ఉన్న 219 గ్రామాలలోని 3.34 లక్షల మంది తాగు నీటి అవసరాలను తీర్చేందుకు 2008లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. సదాశివనగర్ మండలం మల్లన్న గుట్ట వద్ద నాలుగు ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు (ఓహెచ్బీఆర్) నిర్మించాలని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయం నుంచి 0.87 టీఎంసీల నీటిని ఇందులోకి తరలించాలని నిర్ణయించారు. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటరీల ద్వారా గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేయాలని, మధ్య మధ్యలో నాలుగు సంపులను నిర్మించాలనుకున్నారు. ఇప్పటి వరకు ఎస్ఆర్ఎస్పీ జలాశయం వద్ద ఇన్టెక్ వెల్, ఫుట్బ్రిడ్జి, రిటైనింగ్వాల్, నీటిని శుద్ధి చేసే ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు పూర్తయ్యాయి, మూడు ఓహెచ్బీఆర్లను, నాలుగు సంపులను నిర్మించారు. నీటిని తోడేందుకు పంపుసెట్లను బిగించి, టెస్టింగ్ కూడా పూర్తి చేశారు. పైప్లైన్ల జాయింట్లను బిగించి ట్రయల్న్ ్రకూడా విజయవంతంగా నిర్వహించారు. మల్లన్న గుట్ట వద్దకు నీరు విజయవంతంగా చేరుకుంది కానీ పథకం లక్ష్యం మాత్రం నెరవేరలేదు. కారణం అక్కడి నుంచి కామారెడ్డి పట్టణానికి పైపులైన్ల నిర్మాణం పూర్తి కాకపోవడమే. ఫలితంగా పనులు ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్నా ఆయా గ్రామాల గొంతు తడవడం లేదు.
రూ.72.75 కోట్ల అదనపు నిధులకు ప్రతిపాదనలు
ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు ఒక్క గ్రామానికి కూడా తాగునీటిని సరఫరా చేయని గ్రామీణ నీటి సరఫరా అధికారులు అదనంగా 45 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఫేజ్-2 కింద రూ.72.75 కోట్లతో సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. ఇందులో ప్రస్తుత కిరణ్ సర్కారు రూ. 20 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు సంబంధించి అధికారులు టెండరు ప్రక్రియ చేపట్టారు. వచ్చిన నిధుల మేరకు పనులు పూర్తి చేశామని, మిగతా నిధుల కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
కొనసాగుతున్న పైప్లైన్ పనులు
మల్లన్నగుట్ట ఓబీహెచ్ఆర్ల నుంచి కామారెడ్డి పట్టణానికి తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రజారోగ్యశాఖ అదనంగా చేపట్టిన పైప్లైన్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు రెండు నెలల క్రితం ప్రారంభమైన ఈ పనులు నెలలోపు పూర్తి చేస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. గడువు పూర్తి అయినా పను లు ఓ కొలిక్కి రాలేదు. దీంతో రానున్న వేసవిలోనూ కామారెడ్డి పట్టణవాసులకు తాగునీరందే అవకాశాలు కనిపించడం లేదు.