తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుని..
అనంతపురం రూరల్ : ఆర్థికంగా చతికిలబడిపోయినా.. కూలి పనులు చేసుకుంటూ కూతురిని పై చదువులు చదివించిన తల్లిదండ్రుల ఆశలు అడియాశలు చేస్తూ ఓ విద్యాకుసుమం నేలరాలింది. ఇప్పటికే పేదరికంలో మగ్గుతున్న తల్లిదండ్రులు తన పెళ్లికి అప్పు చేయాల్సి వస్తుందని భావించిన యువతి తల్లిదండ్రులకు భారం కాకూడదనుకొని తనువు చాలించింది. అనంతపురం రూరల్ మండలం కామారుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి(24) ఎమ్మెస్సీ బీఈడీ వరకు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు. శుక్రవారం ఇంటికి వచ్చిన మగపెళ్లివారు కట్నం ఎంత ఇస్తారని అడగడంతో.. లక్ష్మి తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని కూతుర్ని చదివించామని, తమ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదని చెప్పడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి శనివారం అమ్మానాన్నలు కూలిపనులకు వెళ్లిన అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.