కాలుతూ కాలుతూ బిఎస్ పీ నేతను వాటేసుకున్నయువకుడు
దూరదర్శన్ ఎంపీ అభ్యర్థుల ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూండగా హఠాత్తుగా ఒక వ్యక్తి తనకు తాను నిప్పంటించుకుని, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిని గట్టిగా వాటేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో జరిగింది.
దూరదర్శన్ జనమత్ 2014 కార్యక్రమాన్ని నిర్వహిస్తూండగా ఉన్నట్టుండి కిరోసిన్ తో నిండా తడిసిన ఒక వ్యక్తి దూసుకువచ్చాడు. అందరూ చూస్తూండగానే తనకు తాను నిప్పంటించుకున్నాడు. ఆ తరువాత పరుగులు తీస్తూ వచ్చి బిఎస్ పీ అభ్యర్థి కమరుజ్జమా ఫౌజీని వాటేసుకున్నాడు. ఇద్దరినీ విడదీసి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ యువకుడికి 95 శాతం, కమరుజ్జమాకి 75 శాతం కాలిన గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
వీరిద్దరిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు వ్యక్తులకు కూడా కాలిన గాయలు అయ్యాయి. ఆ యువకుడెవరు, ఎందుకిలా చేశాడన్నది ఇంకా తెలియరాలేదు. మొత్తం మీద ఈ సంఘటన సంచలనం సృష్టించింది.