kamathipura
-
విరాళాలు సరిపోవు.. ఊతంగా నిలవాలి: పార్వతి నౌరియాల్
చిన్నచిన్న పదాలు, అంకెలు పలకడం, అర్థం చేసుకోవడం చిన్నారి పార్వతి నౌరియాల్‌కు చాలా కష్టమైంది. ‘‘చిన్నపిల్ల కదా నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది అని అనుకోలేదు తల్లిదండ్రులు. బద్దకస్తురాలు... ఏదీ వెంటనే నేర్చుకోదు’’ అని విసుక్కునేవారు. బుడిబుడి అడుగులతో, బుజ్జిమాటలతో ఆకట్టుకునే వయసులో అమ్మానాన్నల నిరాదరణకు గురైన ఆ చిన్నారి నేడు వందల మంది పిల్లలకు చదువు చెప్పడంతోపాటు, ఎంతోమంది సెక్స్వర్క్ర్లను వేశ్యావృత్తినుంచి బయటకు తీసుకువచ్చి గౌరవంగా బతికేందుకు అవకాశాలు కల్పిస్తోంది. మహారాష్ట్రకు చెందిన పార్వతి నౌరియాల్‌కు చిన్నతనంలో డిస్లెక్సియా సమస్య ఉండడంతో మూడేళ్లు వచ్చేంత వరకు పదాలు, అంకెలు కూడా సరిగా పలకలేక పోయేది. స్కూలుకెళ్లి చదువుకోవాల్సి వస్తుందని ఇలా చేస్తుంది అని చిరాకుపడుతుండేవారు తల్లిదండ్రులు. అయితే అదేమీ పట్టించుకోకుండా చదువుకుంటూ అతికష్టం మీద పదోతరగతి పాసయ్యింది పార్వతి. టెంత్ తరువాత పార్వతి డిస్లెక్సియాతో బాధపడుతోందని ఆమె తల్లి గుర్తించింది. అప్పటి నుంచి ఆమె వెన్నంటే ఉండి సమస్యను అధిగమించేందుకు సాయం చేసింది. పార్వతి తల్లి చదువుకోకపోయినప్పటికీ చదువు విలువ తెలియడం వల్ల తన పిల్లలతోపాటు, సమీపంలోని మురికివాడల్లోని అమ్మాయిలను చదివించమని పదేపదే చెబుతుండేది. తల్లి ప్రోత్సాహమే తనను ఇప్పుడు సమాజ సేవకురాలిగా నిలబెట్టిందని చెబుతుంది పార్వతి. ట్రిప్ నుంచి తిరిగి వస్తుండగా.. చక్కగా చదువుకుని విపత్తు నిర్వహణల ఉద్యోగం చేస్తోన్న పార్వతి 2015లో ఒకసారి కర్జత్ ట్రిప్‌కు వెళ్లింది. ట్రిప్ పూర్తిచేసుకుని అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఆమెకు కొంతమంది బాలకార్మికులు కనిపించారు. బాలలతో పనిచేయించకూడదని చట్టాలు చెబుతున్నప్పటికీ అక్కడ అంతమంది బాలకార్మికులు కనిపించడం విచిత్రంగా అనిపించింది. ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు సైతం వారిని చూసీ చూడనట్లు వదిలేయడం తనకు నచ్చలేదు. బాలకార్మికుల కష్టాలను తీర్చేందుకు అధికారులను కలిసి వారి దైన్యస్థితిని గురించి వివరించింది. నెలరోజులు తిరిగాక ఓ వ్యాపార వేత్త .. బాలకార్మికులకు వారాంతాల్లో చదువు చెప్పించడానికి టీచర్లను నియమించాడు. దీంతో కర్జత్‌లోని పిల్లలు చదువుకోవడం ప్రారంభించారు. 139 మంది బాలకార్మికులు బడిబాట పట్టడం ఎంతో సంతోషాన్నిచ్చింది. కోవిడ్ తర్వాత కామటిపురాకు... వందకుపైగా బాలకార్మికులని విద్యార్థులుగా మార్చిన ఆనందంలో మరింత మందిని చదివించాలని నిర్ణయించుకుంది పార్వతి. అప్పుడే కోవిడ్ కారణంగా లాక్డౌన్ విధించడంతో పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది కుటుంబాలను కలిసింది. కుటుంబపోషణకు ఆధారం లేక చావే శరణ్యమంటోన్న అనేకమంది కన్నీటి బాధలు వింటోన్న సమయంలో ఓ నిరుపేద తల్లిదండ్రులు తమ కుమార్తెని పెంచే స్థోమతలేక కామటిపురాకు అమ్మేసినట్లు తెలిసింది. అప్పుడు ఆ అమ్మాయిని ఎలాగైనా రక్షించాలని నిర్ణయించుకుని కామటి పురాలో అడుగుపెట్టింది. అక్కడ ఎంత వెతికినా ఆ అమ్మాయి కనిపించలేదు కానీ, అక్కడ బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నలుగురు అమ్మాయిలను చేరదీసి సొంత డబ్బుతో శిక్షణ ఇప్పించి, వేశ్యావృత్తిని వదిలేలా చేసింది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వేశ్యావృత్తిలోకి బలవంతంగా వస్తోన్న వారిని బయటకు తీసుకువచ్చి, వారికి వివిధ రకాల వృత్తులలో శిక్షణæఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇలా ఇప్పటిదాకా వెయ్యిమందిని కామటిపురా నుంచి బయటకు తీసుకువచ్చి సమాజంలో గౌరవంగా బతికేలా చేసింది. వీరిలో ఎక్కువమంది చిన్నవయసు అమ్మాయిలు ఉన్నారు. వీరి పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ అక్కడి వారికి తన వంతు ఊతం ఇస్తోంది పార్వతి. విరాళాలు కాదు ప్రేరణగా నిలవాలి ‘‘సమాజానికి ఎంతోకొంత తిరిగిచ్చేయాలని..మన దగ్గర ఉన్న డబ్బును దానాలు, విరాళాలుగా ఇవ్వడం, లేదా ఎన్జీవోలతో కలిసి కొంతకాలం పనిచేస్తే సరిపోదు. మరణించేలోపు మనం కొంతమందికి ప్రేరణగా, సలహాదారుగా, శిక్షకులుగా నిలవాలి. అప్పుడు సమాజంలో చాలామంది మారతారు. – పార్వతి నౌరియాల్ -
రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లా: శ్వేతాబసు ప్రసాద్
'కొత్త బంగారు లోకం'తో టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి పెట్టినప్పటికీ తర్వాత చేసిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. అదే సమయంలో సెక్స్ రాకెట్లో ఇరుక్కోవడంతో విమర్శలపాలైంది. కానీ తర్వాతి కాలంలో ఈ కేసులో ఆమె నిర్దోషిగా తేలింది. మరోవైపు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడినప్పటికీ, ఏడాది తిరిగేలోగా వారు విడాకులు తీసుకున్నారు. ఇలా వ్యక్తిగత జీవితంలో సమస్యలు వెంటాడటంతో ఆమె కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోయింది. తెలుగులో సరైన హిట్టు లేకపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చిన ఆమె ప్రస్తుతం "ఇండియా లాక్డౌన్" అనే సినిమా చేస్తోంది. ఇందులో ఆమె సెక్స్ వర్కర్ మెహ్రునిస్సాగా కనిపించనుంది. లాక్డౌన్లో ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులను చవిచూశారన్న అంశంతో మధుర్ బండార్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కోవిడ్ లాక్డౌన్ వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ముంబైలోని రెడ్‌లైట్ ప్రాంతంలో నివసించే సెక్స్ వర్కర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో స్వయంగా తెలుసుకోవాలనుకుంది శ్వేతా. ఇందుకోసం ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా కామాటిపురను సందర్శించిందట. (చదవండి: ఏ సినిమాకు శ్వేతా జాతీయ అవార్డు అందుకున్నారు?) ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. "నేను చేసే పాత్రలు నిజమని నమ్ముతాను, అందులో లీనమైపోతాను. లేదంటే ప్రేక్షకులు ఆ పాత్రతో మమేకం కాలేరు. నా పాత్ర ఇంకా మెరుగ్గా వచ్చేందుకు మధుర్ సర్, నేను, నా టీమ్ మొత్తం రెండు వారాల క్రితం కామాటిపుర వెళ్లాం. అక్కడ వారి యాసను బట్టి నేను సినిమాలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నా. అంతే కాకుండా వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంది? వారి జీవితాలేంటో తెలుసుకున్నా. లాక్డౌన్ వాళ్ల వ్యాపారం మీదనే కాదు, వారి జీవితాల మీద కూడా గట్టి దెబ్బ కొట్టింది. కానీ అక్కడకు వెళ్లడం లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలిచింది. ముఖ్య విషయమేంటంటే నేను అక్కడ మెహ్రునిస్సాను కలిశా. అచ్చంగా నా పాత్రే కళ్లముందు కనిపించినట్లైంది. కనుక నా పాత్రను ఆమెకు అంకితం చేస్తున్నా" అని చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో ఇప్పటివరకు పలువురు నటీమణులు వేశ్యపాత్రలను పోషించారు. చాందినీ బార్(2001)లో టబు, చమేలీ(2003)లో కరీనా కపూర్, ట్రాఫిక్ సిగ్నల్(2007)లో కొంకొణ సెన్శర్మ, మండీ(1983)లో శబానా అజ్మీ, స్మిత పాటిల్ సెక్స్ వర్కర్లుగా కనిపించిన విషయం తెలిసిందే. (చదవండి: ఇష్టమైన ఆహారంపై స్పష్టతనిచ్చిన ప్రియాంక చోప్రా) -
సెక్స్‌వర్కర్ల కుమార్తెలు బురదలో పూసిన పూలు
ఇక్కడ బురద అంటున్నది వేశ్యావాటికను కాదు. వేశ్యావాటికను బురద అనే దృష్టికోణమే తప్పు అంటారు ఆ అమ్మాయిలు. సమాజమే ఒక బురద కావచ్చు...అదే ఈ బురదను తయారు చేస్తుండవచ్చు అని కూడా అంటారు. వేశ్య కూతురు వేశ్య అవుతుందని నియమం. కాదు.. సమాజ పరివర్తన కార్యకర్త అవుతుందనినిరూపిస్తున్నారు ఈ ఆశాదీపాలు. ‘స్టాప్ జడ్జింగ్.. స్టార్ట్ ఇంక్లూడింగ్’... ‘తీర్పులు ఆపండి... మమ్మల్ని తోడు తీసుకోండి’ అని సాదరంగా స్నేహహస్తాన్ని చాపుతున్నారు. ముంబైలోని కామాటిపురా నుంచి కుర్లాకు నలభై నిమిషాల ప్రయాణం. కాని ఆ ప్రయాణం కొందరికి ఒక జీవితకాలంలో సంభవించకపోవచ్చు. కామాటిపురా నుంచి బయటపడి కుర్లాలోని ‘క్రాంతి’ ఎన్.జి.ఓకు చేరిన వారికి ఒక కొత్తప్రపంచం వీలవుతుంది. ‘క్రాంతి’ సంస్థ వేశ్యలకు పుట్టిన కుమార్తెలకు కొత్త జీవితం ఇవ్వడానికి పని చేస్తోంది. వారి కలలు సాకారం కావడానికి రెక్కలు ఇస్తోంది. ఎగిరి వెళ్లదలుచుకుంటే ఎంత దూరమైనా ఎగరనిస్తుంది. అప్పడాలు.. కుట్టుమిషన్లు... ‘2009లో నేను క్రాంతి సంస్థను ప్రారంభించే వరకు ముంబైలోని కొన్ని ప్రభుత్వ సంస్థలు, ఎన్.జి.ఓలు వేశ్యల సంతానానికి కొత్త జీవితం ఇచ్చే ప్రయత్నం చేశాయి. అయితే ఆ జీవితం పరిమితమైనది. వారికి మహా అయితే అప్పడాలు తయారు చేయడం, కుట్టుపని నేర్పించడం చేసేవారు. తర్వాత వారి బతుకు ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నట్టుండేది. ఆ ఆడపిల్లలు ఏ కలలు కంటే ఆ కలలకు తోడు ఇవ్వాలి అని అనుకున్నాను’ అంటుంది రాబిన్చౌరాసియా. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ భారతీయురాలు అక్కడి మిలట్రీలో పని చేసి, అక్కడ లెస్బియన్ల పట్ల, గేల పట్ల ఉన్న వివక్షను వ్యతిరేకించి ఉద్యోగం మానేసింది. నేరుగా ఇండియాకు వచ్చి సెక్స్‌వర్కర్ల కుమార్తెల కోసం పని చేయడం మొదలెట్టింది. ముంబైలోని కుర్లాలో ఈమె స్థాపించిన సంస్థ తలుపులు 24 గంటలూ తెరిచి ఉంటాయి. ఏ సమయంలో అయినా ఏ వేశ్యావాటిక నుంచి అయినా ఏ అమ్మాయి అయినా ఇక్కడికి రావచ్చు. తల దాచుకోవచ్చు. కామాటిపురా సెక్స్ వర్కర్ల కుమార్తెలు ద్వేషం నుంచి ప్రేమకు ‘వేశ్యావాటికలో ఉన్నంత కాలం మా అమ్మను నేను ద్వేషించేదాన్ని. మా అమ్మ చేసే పని తప్పు అని నాకు అందరూ చెబుతుండేవారు. కాని క్రాంతి సంస్థలో చేరాక... ఆ పనిని మా అమ్మ కుటుంబం కోసం, నా కోసం చేసి ఉంటుందనే అవగాహన కలిగింది. మనల్ని మనం క్షమించుకోవడం, ఎదుటివారిని క్షమించగలగడం గొప్ప అవకాశం. అందుకే నేను మా అమ్మను ప్రేమించడం మొదలుపెట్టాను’ అంటుంది మెహక్ అనే ఒక వేశ్యకూతురు. క్రాంతికి చేరుకున్న ఇరవై ముప్పై మంది ఆడపిల్లల బాల్యం భయానకంగా ఉంది. ‘మా నాన్న ఎవరో నాకు తెలియదు. కాని వేరొకడు వచ్చి మా అమ్మను ఎప్పుడూ తంతుండేవాడు’ అని ఒకమ్మాయి చెప్తే ‘మా ఇంటికి వచ్చే ఒక మగాడు చిన్నపిల్ల అయిన నా రేటు అడుగుతుండేవాడు. మా అమ్మ వాణ్ణి బయటకు గెంటి నన్ను కాపాడుకుంటూ వచ్చింది’ అని మరో అమ్మాయి చెప్పింది. ‘నేను ఇంటి బయటివెలుతురు కూడా చూడలేదు. రోడ్డు దాటలేదు. బజారు తెలియదు. అయినా మా అమ్మ పడే హింస చూసి పదేళ్ల వయసులో పారిపోయాను. మూడేళ్లు రోడ్ల మీదే తిరిగి ఈ సంస్థకు చేరుకున్నాను’ అని ఒక అమ్మాయి చెప్పింది. సెక్స్‌వర్కర్ల జీవితాల్లో రెండో భర్తగా ప్రవేశించినవాళ్లు వారి కుమార్తెలకు నరకం చూపించడం చాలా మంది ఆడపిల్లల జీవితంలో ఉంది. కాని ఇంత బాధ అనుభవించినా సరే జీవితాన్ని కాంతివంతం చేసుకోవాలని కలలు కనడమే ఈ అమ్మాయిలు చేసిన, చేయగలుగుతున్న గొప్ప పని. సక్సెస్‌కు అర్థం ఏమిటి? ‘క్రాంతి సంస్థలో చేరిన ఆడపిల్లలకు చదువు ఉండదు. వారి ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు ఉండవు. వారు 13 నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటారు. వారిని ఏ స్కూల్స్‌లోనూ చేర్పించలేము. కనుక మా దగ్గర ఒక స్కూల్ మొదలెట్టాము. ఇది అందరికీ సమానమైన స్కూలు కాదు. ఒక్కో అమ్మాయిని బట్టి ఆమెకు అవసరమయ్యే క్లాసులను డిజైన్ చేస్తాము’ అంటుంది రాబిన్ చౌరాసియా. ‘ఒక అమ్మాయిని ఏడో క్లాసు మూడుసార్లు కూచోబెట్టాము. మూడుసార్లు ఫెయిల్ అయ్యింది. నా మిత్రుడు చెప్పాడు– ఆ అమ్మాయికి రాని పని చెప్పి ఎందుకు ఫెయిల్ అయ్యాననే భావన కలిగిస్తావు. వచ్చిన పని నేర్పించి పాసయ్యానని అనుకోనివ్వొచ్చు కదా’ అని. ఈ ఫెయిల్ అయిన అమ్మాయి డ్రమ్స్ నేర్చుకుంది. ఇవాళ సంగీతం టీచరుగా చాలామంది పిల్లలకు సంతోషం పంచుతోంది. సక్సెస్‌కు నిజమైన అర్థం ఏమిటో నాకు తెలిసింది’ అంటుంది రాబిన్. క్రాంతిలో చేరిన ఆడపిల్లల్లో ఒక అమ్మాయి జుంబా డాన్సర్ అయ్యింది. ఒక అమ్మాయి యూనివర్సిటీలో చదువుకుంటోంది. ఒక అమ్మాయి ఫ్లయిట్ అటెండెంట్ కావాలనుకుంటోంది. ఒక అమ్మాయి కామాటిపురాలో స్కూల్ తెరవాని అనుకుంటోంది. అందరు అమ్మాయిలు చక్కటి ఇంగ్లిష్‌లో మాట్లాడటం నేర్చుకున్నారు. అన్నింటికి మించి పెదాల మీద నిర్భయమైన నవ్వును నిలుపుకోవడం నేర్చుకున్నారు. రెడ్‌లైట్ ఎక్స్‌ప్రెస్ క్రాంతిలో చేరిన ఆడపిల్లలు అందరూ అంతో ఇంతో థియేటర్‌ను కూడా నేర్చుకున్నారు. వీరంతా కలిసి ‘లాల్ బత్తి ఎక్స్‌ప్రెస్’ అనే నాటకం తయారు చేశారు. లాల్ బత్తి అంటే రెడ్‌లైట్ అని అర్థం. నాటకంలో ఈ ఆడపిల్లలందరూ తలా ఒక కంపార్ట్మెంట్గా మారిపోతారు. రెడ్‌లైట్ ఎక్స్‌ప్రెస్ ఒక్కో స్టేషన్లో ఆగుతూ ఉంటుంది. ఒక్కో కంపార్ట్మెంట్ (అమ్మాయి) తన కథ చెబుతూ ఉంటుంది. ఆ కథలన్నీ వేశ్యల జీవితాలను, వారి పిల్లలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఢిల్లీ, ముంబైలలోనే కాదు న్యూయార్క్, లండన్లలో కూడా ఈ అమ్మాయిలు వెళ్లి ఆ నాటకాన్ని ప్రదర్శించారు. లండన్‌లో నాటక సందర్భంలో అక్కడి వేశ్యలను కలిసి వారి జీవితాలను పరిశీలించారు. ‘పెద్ద తేడా లేదు. అందరం ఒక్కటే’ అని ఒక అమ్మాయి చెప్పింది. ఈ నాటకం జరుగుతున్నంత సేపు వెక్కివెక్కి ఏడ్చే ప్రేక్షకులకు కొదవ ఉండదు. తీర్పులు ఎందుకు? ‘ఇండియాలో సెక్స్‌వర్క్ లీగల్. కాని సమాజపరంగా తప్పు. ఈ విభజన వారిని తమలో తాము కుంచించుకుపోయేలా చేస్తోంది. వారి చదువుకు, వైద్యానికి, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలకు దూరం చేస్తోంది’ అంటుంది రాబిన్ చౌరాసియా. ‘ఇది తప్పు... ఇది ఒప్పు అని తీర్పులు ఇవ్వడం చాలా సులభం. ఒకరిది తప్పు అని అనడానికి మనం ఎవరం? వారు ఆ జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నారో అందులో ఎందుకు కొనసాగుతున్నారో మనం ఊహించగలమా? కనుక తీర్పులు చెప్పడం మానండి. వారిని ఎలా కలుపుకుని పోవాలో ఆలోచించండి’ అంటుందామె.ఇది సుదీర్ఘ ప్రయాస అవసరపడే సంగతే. మనుషులు చాలా నెమ్మదిగా మారుతారు. కాని మారరేమో అనుకుని ఊరికే ఉండటం కన్నా మార్చాలని ప్రయత్నించడమే అవసరం. క్రాంతి సంస్థలోని అమ్మాయిలు చేస్తున్నది అదే.– సాక్షి ఫ్యామిలీ -
కోదండరాం అరెస్ట్‌పై జేఏసీ నేతల ఆగ్రహం
-
కోదండరాం అరెస్ట్‌పై జేఏసీ నేతల ఆగ్రహం
హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం అరెస్ట్ విషయంలో పోలీసుల తీరుపట్ల టీజేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామటిపురా పోలీస్‌స్టేషన్‌లో కోదండరాం ఉన్నారన్న సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న జేఏసీ నేతలను పోలీసులు అనుమతించలేదు. కోదండరాం, ఇతర జేఏసీ నేతల నుంచి పోలీసులు ఫోన్లు లాక్కున్నారని జేఏసీ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి అన్నారు. కోదండరాంకు ఏమైందని ఆయన భార్య ఆందోళన చెందుతున్నారని.. భార్యతో మాట్లాడేందుకు ఆయనకు ఫోన్ ఇవ్వాలన్నారు. కోదండరాంతో మాట్లాడేందుకు పోలీసులు ఎందుకు అనుమతించడం లేదో హోం మంత్రి సమాధానం చెప్పాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు కోదండరాంకు క్షమాపణ చెప్పి.. విడుదల చేయాలన్నారు. కాగా.. కోదండరాంను కలిసేందుకు వచ్చిన వెంకటరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘కామాటిపుర’ సెక్స్‌వర్కర్ ఎవరో?
వేశ్యల జీవితాలపై ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. వేశ్య పాత్రను చేయడం నటీమణులకు ఒక సవాలు వంటిదే. అటువంటి సినిమాల్లో స్టార్ హీరోయిన్లు ప్రధాన భూమికలు పోషించి మెప్పించారు. అయితే వేశ్యల జీవితాలకు సంబంధించి ఎవరూ సృ్పశించని కోణంలో కొత్తగా సినిమా తీయాలనుకుంటున్నాడు డెరైక్టర్ అంకుశ్ భట్. ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా అయిన ‘కామాటిపుర’లో ఈ చిత్ర షూటింగ్ జరుగనుంది. ఈ సినిమా గురించి డెరైక్టర్ మాట్లాడుతూ..‘ కామాటిపుర పేరుతో వేశ్యల జీవితాలపై చిత్రం తీయాలని నిర్ణయించాం. ఇందులో ప్రధాన పాత్రకు నటి కొంకణ్‌సేన్ శర్మను తీసుకోవాలనుకున్నాం. ఆమె అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని భావించి, ఆమెను సంప్రదించాం. కాని ఆమె మా అవకాశాన్ని తిరస్కరించింది. అయితే ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాం.. ఒప్పుకుంటుందో లేదో మాత్రం చెప్పలేం.. ప్రధాన పాత్రకు సంబంధించి 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య జీవితాన్ని ఐదు దశలుగా ఆవిష్కరించదలిచాం.. కొంకణ్‌సేన్ అంగీకరించని పక్షంలో మరో నటిని చూసుకోవాల్సిందేగా.. ఈ సినిమాలో ప్రముఖ టీవీ సీరియల్స్‌లో కోడలుగా నటించి మెప్పించిన నటి సాక్షి తన్వర్ కూడా నటిస్తోంది. ఆమెను రెండో ప్రధాన పాత్రధారణిగా తీసుకుంటున్నాం. ఈ చిత్రంతో ఆమెకు ఇప్పటివరకు ఉన్న ఇమేజ్ పూర్తిగా మారిపోతుంది. ఈ చిత్రంలో వ్యభిచారాన్ని ఎక్కువ చేసి చూపించడంలేదు. వేశ్యలు తమ జీవనోపాధి కోసం పగటిపూట ఏం చేస్తుంటారనేది కూడా ఇందులో చూపించబోతున్నాం. వేశ్యల మానసిక సంఘర్షణను ఇప్పటివరకు ఎవరూ స్పృశించని కోణంలో ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నాం. ఈ చిత్రాన్ని ఎవరినో దృష్టిలో పెట్టుకుని నిర్మించడంలేదు. నటీనటుల ఎంపిక పూర్తి కాగానే రెండు నెలల్లో సినిమా సెట్స్ పైకి వెళుతుంది.