మధ్యప్రదేశ్‌లో నదిలో పడ్డ రెండు రైళ్లు
* బ్రిడ్జి దాటుతూ అర్ధరాత్రి మాచక్ నదిలో పడిపోయిన కామయాని, జనతా ఎక్స్‌ప్రెస్‌లు
* రెండు ఇంజన్లతో పాటు దాదాపు 15 బోగీలు నదిలో పడ్డాయంటున్న రైల్వే అధికారులు
* మృతులు భారీగా ఉండే అవకాశం..
* హుటాహుటిన ఘటనాస్థలికి సహాయ బృందాలు
హర్దా (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లో మంగళవారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. రాజధాని భోపాల్‌కు 160 కిలోమీటర్ల దూరంలోని ఖిర్కియా-హర్దా స్టేషన్ల మధ్య మాచక్ నదిపై బ్రిడ్జిని దాటుతూ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు అర్ధరాత్రి 11.45 ప్రాంతంలో పట్టాలు తప్పాయి. రెండు రైళ్ల ఇంజన్లతో పాటు ఏకంగా పదికి పైగా బోగీలు నదిలోకి పడిపోయాయి. ప్రమాదాల తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం 30మంది మృతి చెందారు.
‘‘ముందుగా ముంబై నుంచి వారణాసి వెళ్తున్న కామయాని ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. వెనక భాగంలోని దాదాపు 10 బోగీలదాకా నదిలోకి పడిపోయాయి. అదే సమయంలో జబల్పూర్ నుంచి ముంబై వెళ్తున్న జనతా ఎక్స్‌ప్రెస్ కూడా సమాచార లోపంతో సరిగ్గా అదే ప్రదేశంలో పట్టాలు తప్పింది. ఆ రైలు ఇంజన్‌తో పాటు 5 బోగీలు కూడా నదిలోకి పడిపోయాయి’’ అని రైల్వే అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా తెలిపారు. అయితే, కామయానిలో ఎస్ 1 నుంచి ఎస్ 11 వరకు మొత్తం 11 బోగీలు, అలాగే జనతాలో ఎస్ 2 నుంచి ఎస్ 6 వరకు 5 బోగీలు కలిపి మొత్తం 16 బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది.
భారీ వర్షాలకు నది పొంగిపొర్లుతుండటం, బ్రిడ్జి పూర్తిగా వరద నీటిలో మునిగిపోయి ఉండటం ప్రమాదాలకు కారణం కావచ్చంటున్నారు. కడపటి సమాచారం అందేవరకూ కూడా రెండు రైళ్ల తాలూకు ఇంజన్లు, బోగీలు ఇంకా నదిలోనే ఉన్నాయని సక్సేనా తెలిపారు. సహాయక చర్యలను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 25 మంది డాక్టర్లతో కూడిన వైద్య బృందాన్ని హుటాహుటిన ఘటనా స్థలికి పంపినట్టు ఆయన ట్వీటర్లో వెల్లడించారు. ఘటనా స్థలి వద్ద భారీ వర్షం పడుతుండటం, చిమ్మచీకటిగా ఉండటంతో మృతుల సంఖ్యపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు.
బోగీలను వీలైనంత త్వరగా నదిలోంచి బయటికి తీసేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. హర్దా కలెక్టర్ రజనీశ్ శ్రీవాస్తవ, జిల్లా ఎస్పీ, పలువురు రైల్వే ఉన్నతాధికారులు సహాయక సిబ్బందితో కలిసి మూడు ప్రత్యేక రైల్లో ఘటనా స్థలికి వెళ్లారు. కాగా, నదిలో పడిపోయిన రెండు రైళ్లకు సంబంధించిన 15 బోగీలలో చిక్కుకున్న 300 మంది ప్రయాణికులను రక్షించినట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో మాచక్ నది ఉధృతంగా ప్రవహిస్తోందని, ఆ ప్రవాహంలో 50 నుంచి 60 మంది వరకు కొట్టుకపోయారంటూ చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్‌లో రైళ్ల ప్రమాదాల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలను రైల్వే శాఖ చేపట్టింది. ముంబై, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ నుంచి బయలుదేరే పలు రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు రాజస్థాన్, కోట మీదుగా మళ్లించినట్టు రైల్వే శాఖ వెల్లడించింది.