కార్మికుల కారణంగానే ప్లాంట్ తరలింపు
ఓసీటీఎల్పై కామినేని గ్రూప్
సహేతుక కారణం లేకుండా కార్మికుల సమ్మె
పనులను అర్ధాంతరంగా వదిలేస్తున్నారు
తరలింపుతో తెలంగాణకురూ. 25 కోట్ల ఆదాయనష్టం
700 ఉద్యోగాలకు కోత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్మిక సంఘం ఒత్తిడికితోడు ఉత్పత్తి కార్యకలాపాలకు కార్మికులు విఘాతం కలిగిస్తున్నందునే ఆయిల్ కంట్రీ ట్యూబ్యులార్ (ఓసీటీఎల్) ప్లాంటును తరలించాలనే నిర్ణయానికి వచ్చినట్టు కామినేని గ్రూప్ చెబుతోంది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద ఉన్న ప్లాంటును ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కష్ణపట్నం సమీపంలో ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. కార్మికులు ముందస్తు నోటీసు లేకుండా సమ్మెకు దిగుతున్నారని కంపెనీ అంటోంది.
దీంతో పైపుల నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తయారీ ప్రక్రియకు అంతరాయం కలగకూడదనే ఉద్ధేశంతోనే ప్లాంటును మరోచోట ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఉత్పత్తి పడిపోయి ప్రస్తుతం నెలకు రూ.10 కోట్లు నష్టం వాటిల్లుతోంది. ప్లాంటు తరలిపోతే తెలంగాణ ప్రభుత్వం పన్నుల రూపంలో సుమారు రూ.25 కోట్ల వార్షికాదాయం కోల్పోతుంది. 700 మంది ఉద్యోగులు రోడ్డున పడతారు.
సంఘం ఏర్పాటయ్యాకే..
కంపెనీ మూడేళ్లకోసారి ఒక్కో ఉద్యోగితో వ్యక్తిగత ఒప్పందం కుదుర్చుకుని కనీస వేతనాన్ని పెంచుతోంది. కనీస వేతన చట్టం ప్రకారం కార్మికుడికి 2011లో రూ.6,776, 2014లో రూ.7,959 చెల్లించాలని ప్రభుత్వం నిర్దేశించింది. కంపెనీ 2011 నుంచి రూ.9,959 చెల్లిస్తూ వస్తోంది. 2014లో వేతన సవరణ ఒప్పందం జరగాల్సి ఉంది. కార్మికులతో వ్యక్తిగతంగా కాకుండా తమతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని కొన్ని నెలల క్రితం ఏర్పాటైన ఓసీటీఎల్ కార్మిక సంఘం పట్టుబడుతోంది. సంఘాన్ని గుర్తించబోమని కంపెనీ స్పష్టం చేస్తోంది. ఈ అంశమే వివాదాలకు కారణమైంది. కార్మిక సంఘాన్ని గుర్తించే విషయంలో కంపెనీలదే తుది నిర్ణయమని కామినేని గ్రూప్ అంటోంది.
పెద్ద ప్రమాదమే జరిగేది..
గత నెలలో కార్మికులు అనూహ్యంగా పనులను వదిలివేశారని, ఇంజనీర్లు అప్రమత్తం కాకపోతే పెను ప్రమాదమే జరిగేదని కామినేని గ్రూప్ డెరైక్టర్ కామినేని శశిధర్ తెలిపారు. పైపుల నాణ్యతను కార్మికులు పరీక్షించడం లేదన్నారు. ‘చమురు, సహజ వాయువు బావుల్లో 10 కిలోమీటర్ల లోతుకు కూడా ఈ పైపులు వెళ్తాయి. ఏ చిన్న లీకేజీ ఉన్నా డ్రిల్లింగ్ కంపెనీలకు నష్టం వేల కోట్లలో ఉంటుంది. ఓసీటీఎల్ రాక ముందు ఓఎన్జీసీ తదితర దిగ్గజాలు పైపులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవని, ఈ విషయంలో ప్రభుత్వం చాలా సందర్భాల్లో కంపెనీని మెచ్చుకుందని శశిధర్ వివరించారు. కంపెనీకి ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి’ అని ఆయన చెప్పారు.
రమ్మంటున్న మలేషియా..
ఓఎన్జీసీకి 20 వేల పైపులు ఇంకా సరఫరా చేయాల్సి ఉంది. కొత్త ఆర్డర్లేవీ కంపెనీ తీసుకోవడం లేదు. ఓసీటీఎల్, కామినేని స్టీల్ అండ్ పవర్, యునెటైడ్ సీమ్లెస్ ట్యూబ్యులర్ కు (యూఎస్టీపీఎల్) కలిపి రూ.5,000 కోట్లను గ్రూప్ పెట్టుబడి పెట్టింది. రూ.3,000 కోట్లతో చేపట్టాల్సిన విస్తరణ అటకెక్కింది. ఈ మూడు కంపెనీల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల మంది పనిచేస్తున్నారు. ఒక్క ఓసీటీఎల్లో 700 మంది ఉద్యోగులున్నారు. 80 శాతం మంది స్థానికులే. ఒకానొక సమయంలో ఒక ఏడాది రూ.1,500 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. యూఎస్టీపీఎల్లో మలేషియా ప్రభుత్వ సంస్థ యూఎండబ్ల్యుకు 40 శాతం వాటా ఉంది. ఇక్కడ అనిశ్చితి ఉన్న కారణంగా మలేషియాలో ప్లాంటు పెట్టాల్సిందిగా యూఎండబ్ల్యు కోరుతున్నట్లు శశిధర్ చెప్పారు.