టాక్సీ డబ్బులు అడిగిన భారతీయుడిపై దారుణం
లండన్: టాక్సీ డబ్బులు అడిగినందుకు భారత సంతతికి చెందిన ఓ టాక్సీ డ్రైవర్ ను ఇస్లామిక్ స్టేట్ సభ్యుడంటూ ఆరోపిస్తూ నలుగురు ప్రయాణికులు అతడిపై దాడికి దిగారు. గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక న్యూస్ పేపర్ కథనం ప్రకారం... భారత్‌కు చెందిన కనక్ హిరానీ బ్రిటన్‌లో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 4న కొందరు ప్రయాణికులు హిరానీ టాక్సీ ఎక్కారు. వేల్స్ లోని కార్డిఫ్ సిటీ నుంచి సమీపంలోని ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లాలని సూచించారు.
రెస్టారెంట్ వద్ద టాక్సీ ఆపమని ఇద్దరు వారికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కోసం లోనికి వెళ్లారు. టాక్సీలో ఉన్న మరో ఇద్దరితో ఆలస్యం అవుతుందని, ఇప్పటికే మీటరుపై 20 పౌండ్లు ఎక్కువ అయిందని హిరానీ చెప్పాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. టాక్సీ డ్రైవర్‌కు మనీ ఇవ్వడం ఇష్టంలేని కారణంగా వారు అనవసర రాద్దాంతం చేశారు. మొదట తమ వద్ద డబ్బులున్నాయి ఏం పర్లేదు అన్నారనీ.. ఆ తర్వాత టాక్సీలో కూర్చున్న ఇద్దరు తనను తిట్టడం మొదలెట్టారన్నాడు. ఆ తర్వాత టాక్సీకి అడ్డంగా రోడ్డుపై ఉండి హిరానీని ఇబ్బంది పెట్టారు. ఏకంగా డ్రైవర్ నుంచి టాక్సీ లాక్కుని అతడ్ని గెంటేయాలని చూడటం గమనార్హం.
నువ్వు ఐఎస్ఐఎస్ కి చెందిన ఉగ్రవాదివి కాదని నమ్మడం ఎలా.. రుజువు చేస్తావా అని టాక్సీ డబ్బులు ఎగ్గొట్టడానికి డ్రైవర్‌ను దబాయించారు. దాడి చేయాలని వారు ప్రయత్నించగా ఏం చేయాలో పాలుపోని డ్రైవర్ అలారమ్ ఆన్ చేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారని సౌత్ వేల్స్ పోలీసు అధికారి తెలిపారు. టాక్సీ మనీ పేమెంట్ నుంచి బయటపడటానికి జాతి అహంకార దాడులకు పాల్పడ్డ ఈ ఘటనలో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.