వేద ధర్మాన్ని పరిరక్షించాలి
కె.తాడేపల్లి (విజయవాడ రూరల్) : మనిషిని మనిషిగా తీర్చిదిద్దే జీవన వికాస సోపానాలు వేదాలని, వేద ధర్మాన్ని పరిరక్షించి, భావితరాలకు వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉందని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి అన్నారు. రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో ఉన్న పంచముఖ వీరాంజనేయస్వామి దేవస్థానం, షణ్ముఖ వేద విద్యాలయాలను స్వామి శుక్రవారం సందర్శించారు. ఆలయ నిర్వాహకులు మారుతి లక్ష్మీనారాయణ, మారుతి జానకీరామశర్మ.. స్వామికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవకోటి కుంకుమార్చన వివరాలను తెలుసుకుని స్వామీజీ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్వామి అనుగ్రహభాషణం చేస్తూ మానవ వికాసానికి వేదం పునాదిగా నిలుస్తోందన్నారు. వేద పారాయణ జరిగే స్థలం అత్యంత పవిత్రత పొందుతుందని, వేదం వినడం వల్లే అన్ని పాపాలు తొలగిపోతాయన్నారు. వేద ధర్మ పరిరక్షణకు ప్రజలందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వ్యాపారవేత్తలు మాగంటి సుబ్రహ్మణ్యం, దిట్టకవి రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.