ఐదు కిలోల మగ శిశువు జననం
పళ్లిపట్టు: సాధారణంగా శిశువు బరువు మూడు కేజీల వరకు ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా 5.1 కేజీల బరువుతో శిశువుకు శస్త్ర చికిత్స లేకుండా సహజంగా జన్మనిచ్చిందో మహిళ. ఈ ఘటన కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కాంచీపురం పిల్లయార్పాళ్యం ప్రాంతానికి చెందిన బాలమురుగన్ పట్టు చీరల డిజైనర్. అతని భార్య భానుమతి మూడో ప్రసవం కోసం కాంచీపురంలోని ప్రభుత్వాసుపత్రిలో చేరారు. భానుమతి బుధవారం ఉదయం 5.1 కేజీ బరువైన మగ శిశువుకు జన్మనిచ్చింది.
అయితే రాష్ట్రంలో ఐదు కేజీల కన్నా ఎక్కువ బరువున శిశివుకు శస్త్ర చికిత్స లేకుండా సాధారణంగా పుట్టడం రికార్డుగా పేర్కొంటున్నారు వైద్యులు. ఈ విషయమై నవజాత శిశువుల ప్రత్యేక వైద్యురాలు డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ... ప్రస్తుతం గర్భిణీలకు అధిక సంఖ్యలో శస్త్రచికిత్స ద్వారా మాత్రమే ప్రసవం జరుగుతున్నది.
అయితే ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే సహజ సిద్ధ ప్రసవానికి వైద్యులు కృషి చేస్తున్నారు. కొన్ని సమయాల్లో మాత్రమే శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం నిర్వహిస్తాం. భానుమతిని పరీక్షించిన తరువాత శిశువు బరువు గుర్తించాం. బిడ్డకు జన్మనిచ్చే స్థాయికి గర్భవతి ఆరోగ్యంగా ఉండడంతో సహజసిద్ధంగా శిశువుకు జన్మనిచ్చేలా చూశామని తెలిపారు.