నీరవ్ మోదీ 2.0
సాక్షి, చెన్నై: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను నిండా ముంచేసిన నీరవ్ మోదీ కుంభకోణం ఘటన మరువకముందే... ఇలాంటివే మరిన్ని స్కామ్‌లు పుట్టగొడుగుల్లా వెలుగుచూస్తున్నాయి. తాజాగా చెన్నైకి చెందిన కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బంగారు నగల విక్రయ సంస్థ బ్యాంకులకు వందల కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టినట్లు బయటపడింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సహా మొత్తం 14 బ్యాంకులను దాదాపు రూ.825 కోట్ల మేర మోసం చేసినట్లు వెల్లడైంది. కనిష్క్ గోల్డ్‌పై సీబీఐకి ఈ ఏడాది జనవరిలో ఎస్బీఐ ఫిర్యాదు చేసింది.
ప్రమోటర్లు మారిషస్‌లో...
కనిష్క్ గోల్డ్‌కు భూపేష్ కుమార్ జైన్, ఆయన భార్య నీతా జైన్లు ప్రమోటర్, డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ సంస్థకు ఎస్బీఐ నేతృత్వంలోని 14 ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల కన్సార్షియం ఇచ్చిన రుణాలన్నీ మొండిబకాయిలుగా మారిపోయాయి. ప్రమోటర్లు నకిలీ డాక్యుమెంట్లతో మోసపూరితంగా రుణాలను పొందారని.. ఆ తర్వాత వాటిని ఎగవేసినట్లు సీబీఐకి ఈ ఏడాది జనవరి 25న ఇచ్చిన ఫిర్యాదులో ఎస్బీఐ పేర్కొంది. రాత్రికిరాత్రే నగల షాపులన్నింటినీ కనిష్క్ మూసేసిందని కూడా ఆరోపించింది. కాగా, కనిష్క్ గోల్డ్‌ను మూసేసి... భారత్ నుంచి మకాం మార్చేసిన భూపేష్, నీతా జైన్లు ప్రస్తుతం మారిషస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వారిని సంప్రదించడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ... అందుబాటులోకి రావడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు.
నవంబర్‌లో ఆర్బీఐకి సమాచారం...
కనిష్క్ గోల్డ్ రుణం విషయంలో మోసం జరిగినట్లు గతేడాది నవంబర్ 11న తొలిసారిగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)కు ఎస్బీఐ తెలియజేసింది. ఈ ఏడాది జనవరిలో కన్సార్షియంలోని మిగతా బ్యాంకులన్నీ కూడా ఈ రుణాన్ని మోసపూరితమైనదిగా ఆర్బీఐకి నివేదికలు పంపాయి. కాగా, ఈ నగల సంస్థ కన్సార్షియంలోని 8 బ్యాంకులకు రుణ బకాయిల చెల్లింపులను నిలిపివేయడంతో గతేడాది మార్చిలో డిఫాల్ట్(మొండిబకాయి)గా మారినట్లు ఎస్బీఐ పేర్కొంది. ఏప్రిల్ నాటికి మొత్తం 14 బ్యాంకులకు కూడా చెల్లింపులను ఆపేసింది. దీంతో తనిఖీ కోసం వెళ్లిన బ్యాంకర్లకు ప్రమోటర్లు ముఖం చాటేశారు. మే నెలలో కనిష్క్ గోల్డ్ కార్పొరేట్ ఆఫీస్, ఫ్యాక్టరీ, షోరూమ్‌లన్నీ ఖాళీ అయిపోయినట్లు బ్యాంకర్లు గుర్తించారు. మొత్తం షోరూమ్లన్నింటి నుంచీ నగల స్టాక్‌నంతా అప్పటికే ప్రమోటర్లు సర్దేశారు.
వడ్డీతో కలిపి రూ.1,000 కోట్ల పైమాటే...
కాగా, ఎస్బీఐ ఫిర్యాదు ప్రకారం చూస్తే.. కనిష్క్ గోల్డ్‌కు 2007 నుంచీ రుణాలు ఇస్తునట్లు వెల్లడైంది. 2012లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో కూడిన కన్సార్షియం భారీ మొత్తంలో మెటల్ గోల్డ్ లోన్‌ను మంజూరు చేశాయి. మొత్తంమీద 14 బ్యాంకులకు కలిపి కనిష్క్ గోల్డ్ ఎగ్గొట్టిన అసలు మొత్తం రూ.825 కోట్లు కాగా, దీనికి వడ్డీని కలిపితే బకాయి మొత్తం రూ.1,000 కోట్లకు పైగానే ఉంటుందని బ్యాంకర్లు లెక్కగడుతున్నారు. కనిష్క్ గోల్డ్‌కు ఎస్బీఐ అత్యధికంగా రూ.215 కోట్ల రుణాలిచ్చింది. కన్షార్షియంలో పీఎన్బీ(రూ.115 కోట్లు), యూనియన్ బ్యాంక్ (రూ.50 కోట్లు), సిండికేట్ బ్యాంక్ (రూ.50 కోట్లు), బ్యాంక్ ఆఫ్ ఇండియా(రూ.45 కోట్లు), ఐడీబీఐ బ్యాంక్(రూ.45 కోట్లు), యూకో బ్యాంక్(రూ.40 కోట్లు), తమిళనాడు మర్కంటైల్ (రూ.37 కోట్లు), ఆంధ్రా బ్యాంక్(రూ. 30 కోట్లు), బీఓబీ(రూ.30 కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్(రూ.25 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్(రూ.25 కోట్లు), సెంట్రల్ బ్యాంక్(రూ.20 కోట్లు), కార్పొరేషన్ బ్యాంక్(రూ.20 కోట్లు) ఉన్నాయి.
2006లో ప్రారంభం...
2006లో చెన్నై కేంద్రంగా ఆరంభమైన కనిష్క్ గోల్డ్ కార్యకలాపాలు ఇతర రాష్ట్రాలకూ విస్తరించాయి. దీనికి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, విజయవాడ, విశాఖపట్నంలో కూడా షోరూమ్‌లు ఉన్నాయి. 2014 వరకూ ‘క్రిజ్’ బ్రాండ్ పేరుతో సొంతంగా తయారు చేసిన ఆభరణాలను కంపెనీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విక్రయించింది. అయితే, 2015 నుంచి బిజినెస్–టు–బిజినెస్ విధానానికి కంపెనీ మారిందని ఎస్బీఐ తన ఫిర్యాదులో వివరించింది. కేవలం పెద్ద రిటైల్ జువెలరీ సంస్థలకు ఆభరణాల సరఫరాను మొదలుపెట్టినట్లు వెల్లడించింది. కాగా, మొత్తం రుణంలో తమ వద్ద తనఖాగా ఉంచిన ఆస్తులు(సెక్యూరిటీ) కేవలం రూ.156.65 కోట్లు మాత్రమేనని ఎస్బీఐ చెబుతోంది. రుణ నిధులను ప్రమోటర్లు, డైరెక్టర్లు దారి మళ్లించారని కూడా పేర్కొంది.
సీబీఐ ఎఫ్ఐఆర్... సోదాలు
బ్యాంకులను మోసం చేసిన కేసులో కనిష్క్ గోల్డ్‌పై సీబీఐ ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా కనిష్క్ ప్రమోటర్ల ఆఫీసులు, ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించినట్లు సీబీఐ అధికారులు బుధవారం పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో కనిష్క్ ప్రమోటర్లు భూపేష్ కుమార్ జైన్, నీతా జైన్, ఇతర కంపెనీ ప్రతినిధులు తేజ్‌రాజ్ అచా, అజయ్ కుమార్ జైన్ సుమిత్ కేడియాలతో పాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బ్యాంకు అధికారులతో సంప్రదింపులు జరిపామని, ఫిర్యాదులో కొన్ని లోపాలను బ్యాంకు సరిదిద్దుకోవాల్సి రావడంతో దర్యాప్తును వెంటనే చేపట్టలేకపోయినట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.