సాగు కష్టాల్లో ఖరీఫ్ రైతులు
రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
జిల్లాలో సాగునీరందక డెల్టాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్తో కన్నబాబు సమావేశమయ్యారు. జిల్లాలో పలు సమస్యలతోపాటు గడపగడపకూ వైఎస్సార్ జరుగుతున్న తీరును అధినేతకు వివరించారు. ప్రధానంగా ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టాలో ఇప్పటికీ సాగునీరులేక నాట్లువేయలేని పరిస్థితి నెలకొందన్నారు. సుమారు 40వేల ఎకరాల్లో రైతులు సాగుచేయడం మనివేసి సాగును విరమించుకున్నా ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని చెప్పారు. తాను కరపతో సహా పలు మండలాల్లో పర్యటించినప్పుడు సాగునీరులేక పొలాలు ఎండిపోతున్న విషయాన్ని రైతులు తెలియజేశారని ఆయన జగన్కు వివరించారు. అవసరమైతే రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు ప్రతీనాయకుడు, కార్యకర్తలు ముందుండాలని కన్నబాబుకు జగన్ సూచించారు. ఇటీవల అమలాపురంలో గోవధ అపోహ బాధితుల పరిస్థితిని జగన్ ఆరా తీశారు. వారికి వైద్యం ఏ విధంగా అందుతుంది, ప్రభుత్వం నుంచి సాయం అందిందా? లేదా అనే విషయాలను కన్నబాబును అడిగారు. చిత్తూరు ఎంపీ వరప్రసాద్ సహా పలువురు నాయకులు బాధితులను పరామర్శించారని కన్నబాబు చెప్పారు. పార్టీకి సంబంధించి పలు విషయాలను చర్చించారు.