శాండిల్‌వుడ్ స్వాతిముత్యం!
సౌత్ స్కోప్
సుదీప్.. కన్నడచిత్రపరిశ్రమ శాండల్‌వుడ్ సూపర్‌స్టార్. మాస్లో మంచి ఇమేజ్ ఉన్న స్టార్హీరో. అంతేనా... సుదీప్ ప్రతిభ గురించి ప్రస్తావించాలంటే కమల్‌హాసన్‌ను గుర్తు చేసుకోవాలి, ఈ హీరో ఎదిగిన తీరును గురించి చెప్పాలంటే షారూక్ ఖాన్‌ను ప్రస్తావించాలి. సుదీప్ ప్రయోగాల ప్రస్థానం విషయంలో తమిళ స్టార్హీరో విక్రమ్‌తోనూ పోలిక ఉంటుంది. ఇంతమంది హీరోల్లోని లక్షణాల మేలిమి కలయిక సుదీప్.
తెలుగు సినీ సముద్రంలో విరిసిన ‘స్వాతి ముత్యం’ సినిమాను కన్నడలో రీమేక్ చేసిన సాహసి సుదీప్. కమల్‌హాసన్ అసమాన నటనా ప్రతిభకు మైలు రాయిగా నిలిచిపోయిన ‘శివయ్య’ పాత్రను కన్నడలో లీడ్ చేసిన వ్యక్తిగా సుదీప్‌ను మనం పరిచయం చేసుకోవచ్చు. అలా కాదు అనుకొంటే ‘ఈగ’ సినిమాలో విలన్‌గానూ, రక్తచరిత్ర -2 సినిమాతో తెలుగువాళ్లకు తెలిసినవాడే.
బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్ టీవీ సీరియల్స్ ద్వారానే నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఈ శాండిల్‌వుడ్ బాద్షా కూడా టీవీ సీరియల్స్‌తోనే కెరీర్ మొదలెట్టాడు. చిత్రరంగంలో పెద్దగా సంబంధంలేని ఒక హోటల్ యజమాని కుమారుడు అయిన సుదీప్ టీవీలో అనుకోకుండా వచ్చిన సీరియల్స్‌తో గుర్తింపు సంపాదించుకొని అటు నుంచి సినిమాల్లోకి వచ్చాడు.
దాదాపు 300 సినిమాల్లో నటించిన మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించిన తొలి సినిమా ఇంత వరకూ విడుదల కాలేదు. సుదీప్ నటించిన ఫస్ట్ సినిమానూ విడుదల కాలేదు. రెండూ మధ్యలో ఆగిపోయాయి. సుదీప్కైతే రెండో సినిమాతోనూ అదే అనుభవం మిగిలింది. హీరోగా నటించిన ఆ రెండు సినిమాలు విడుదల కాకపోవడంతో 1999లో విడుదల అయిన ‘స్పర్శ’ అనే సినిమాలో సపోర్టింగ్ రోల్ చేశాడు ఈ హీరో. ఆ సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది.
తమిళహీరో విక్రమ్ ‘సేతు’ సినిమాతో తొలి హిట్‌ను సొంతం చేసుకొంటే...అదే సినిమాను కన్నడలో రీమేక్ చేసి విజయం సొంతం చేసుకొన్నాడు సుదీప్. 2001లో ‘హుచ్చా’ పేరుతో విడుదల అయ్యింది ఆ సినిమా. తర్వాత ధమ్, నంది సినిమాలు సూపర్‌హిట్స్. 2003లో వచ్చిన ‘కిచ్చా’ సినిమా సుదీప్‌ను స్టార్‌ను చేసింది. ఇందులో కృష్ణ అలియాస్ కిచ్చాగా చేసిన సుదీప్ సౌతిండియా ఫిలింఫేర్లో బెస్ట్యాక్టర్ అవార్డును అందుకొన్నాడు.
యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్‌కు యాక్టర్, స్క్రిప్ట్ రైటర్, సింగర్, ప్రొడ్యూసర్, డెరైక్టర్‌గా గుర్తింపు ఉంది. సుదీప్ కూడా అచ్చం అలాగే ఈ రంగాలన్నింటిలోనూ ప్రతిభను చాటుకొన్నాడు. మలయాళంలో సూపర్‌హిట్ అయిన ‘ఆటోగ్రాఫ్’ సినిమాను కన్నడలో రీమేక్ చేసి దర్శకుడు అయ్యాడు ఈ హీరో.
సుదీప్ ప్రతిభ కేవలం కన్నడ చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదు. అక్కడ స్టార్‌గా వెలుగుతున్న ఇతడి కాంతిని బాలీవుడ్ వరకూ తీసుకెళ్లాడు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ ‘ఫూంక్’తో సుదీప్‌ను బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వర్మ కంపెనీ నుంచే వచ్చిన ఫూంక్-2, రక్తచరిత్ర సినిమాల్లో కూడా సుదీప్ నటించాడు. కర్ణాటకలో సుదీప్ మాస్ ఇమేజ్ ఉన్న హీరో. శాండిల్‌వుడ్ స్థాయికి భారీ ఓపెనింగ్ కలెక్షన్లను సాధించగల సామర్థ్యమున్న స్టార్.
ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోలకు చాలా ధైర్యం ఉండాలి. ప్రేక్షకులు తమను ఎలా రిసీవ్ చేసుకొంటారో అనే విషయంలో వారు స్థిమితమనస్కులై ఉండాలి. అలాంటి ప్రయోగాత్మక సినిమాలను తొలిసారి చేసే వాళ్ల సంగతి అది. అయితే ఒక హీరో బాగా చేసి పేరు తెచ్చుకొన్న రోల్‌ను రీమేక్ రూపంలో అనుకరించడం అంటే మామూలు విషయం కాదు. అది కత్తిమీద సాము. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా అంతే సంగతులు. సుదీప్ అలాంటి సామునేర్చిన నటుడు. చాలా మంది హీరోలు ప్రయోగాత్మకంగా చేసిన క్యారెక్టర్లను విజయవంతంగా రెండోసారి చేసి చూపించాడు. రీమేక్లతోనే తన ప్రత్యేకతను నిరూపించుకొంటున్నాడు. స్టార్‌హీరోగా, బెస్ట్ యాక్టర్‌గా వెలుగొందుతున్నాడు.
- జీవన్