Kannada movie industry
-
సినిమా రంగంలో భారీ పెట్టుబడి.. అన్ని భాషల్లోనూ ఎంట్రీ..!
కన్నడలో బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందించిన నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్'. కేజీఎఫ్, కాంతార లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ రాబోయే ఐదేళ్లలో భారతీయ వినోద పరిశ్రమలో రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ వెల్లడించారు. అన్ని సౌత్ భాషల్లో సినిమాలను నిర్మించేందుకు తమ సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన తెలిపారు. విజయ్ కిరగందూర్ మామట్లాడుతూ.. 'భారత్ వినోద పరిశ్రమలో వచ్చే ఐదేళ్ల పాటు రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నాం. దీనివల్ల ఇండియాలో వినోద పరిశ్ర మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. ప్రతి ఏడాది ఒక ఈవెంట్ మూవీతో సహా ఐదారు సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం మేము అన్ని దక్షిణ భాషలలో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సాంస్కృతిక కథల ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవ్వాలని ప్రయత్నిస్తున్నాం.' అని అన్నారు. -
రూ. మూడు వందలతో బెంగళూరు వచ్చా: యష్
కన్నడ స్టార్ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన 'కేజీఎఫ్ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. యష్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కన్నడ ఇండస్ట్రీలో ఈ స్థాయికి ఎదగడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. ప్రస్తుతం తాను ఇంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ, ఒకప్పుడు సాధారణ జీవితం గడిపాడు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. తన కెరీర్ మొదటిలో పడ్డ ఇబ్బందుల గురించి యశ్ ఇటీవల పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. సినీ అవకాశాల కోసం తాను కేవలం మూడు వందల రూపాయలతో బెంగళూరులో అడుగుపెట్టాననే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో పుట్టిన యశ్ ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. తండ్రి బస్ డ్రైవర్, తల్లి గృహిణి. కాగా యశ్ సినిమాల్లోకి వెల్లేందుకు వారి కుటుంబం అంగీకరించలేదు. కానీ వారు యష్ కోసం సినిమాల్లో ప్రయత్నించేందుకు తనకు కొంత సమయం మాత్రం ఇచ్చారు. ఆ సమయంలోపు అవకాశాలు దక్కించుకుంటే సరి. లేదంటే తాము చెప్పిన పనిలో చేరాలని సూచించారు. దీనికి అంగీకరించిన యశ్ తన తండ్రి నుంచి తీసుకున్న మూడు వందల రూపాయలతో బెంగళూరు చేరుకున్నాడు. ఈ విషయం గురించి యశ్ మాట్లాడుతూ.. మూడు వందల రూపాయలతో బెంగళూరు చేరుకున్న నేను మొదట సీరియల్స్‌లో అవకాశం దక్కించుకున్నాను. తర్వాత మెల్లిగా సినిమాల్లోకి అడుగుపెట్టా అని చెప్పుకొచ్చాడు. అలా యశ్ సీరియల్స్‌లో నటిస్తున్నప్పుడే తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత కన్నడ చిత్రాలలో చిన్న చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశాడు. చివరకు 2008లో 'రాకీ' చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత వచ్చిన వరుస హిట్లతో యశ్ కన్నడనాట స్టార్ హీరోగా ఎదిగాడు. 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక ఇటీవలే విడుదలైన 'కేజీఎఫ్-2'తో బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా పాన్ ఇండియా స్టార్‌గా యష్ అవతరించాడు. -
సౌత్ ఇండియాలోనే ఏ హీరోకి లేని సక్సెస్ గ్రాఫ్ పునీత్ సొంతం
బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు సౌత్ ఇండియాలోనే ఏ సినిమా హీరోకి లేని ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన నటించిన 29 చిత్రాలలో అత్యదికం హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లే అత్యధికం. పునీత్ రాజ్‌కుమార్ కెరీర్లో కెవలం 4 సినిమాలు మాత్రమే నిరాశను కలిగించాయి. ఇలా పునీత్ రాజ్‌కుమార్ కెరీర్ ఆరంభంలో వరుసగా 11 చిత్రాలు సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లే కావడం విశేషం. ఆ రికార్డ్స్ సౌత్ ఇండియాలో ఏ ఇతర హీరోకు లేదనే చెప్పాలి. అయితే ఆయన విజయంలో మన తెలుగు వాళ్ళ పాత్రే ఎక్కువ. పునీత్ మొదని సినిమా నుంచి పవర్ స్టార్ బిరుదు వరకు తెలుగు సినిమా దర్శకులు, రచయితల పాత్ర ఉండటం విశేషం. తన తండ్రి స్వర్గీయ రాజ్‌కుమార్ కోరిక మేరకు మొదటి సినిమా పూరీ జగన్నాద్ దర్శకత్వంలో నటించాడు. పూరీ దర్శకత్వంలో 'అప్పు' చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు పునీత్. ఆ సినిమా రవితేజ హీరోగా నటించిన ఇడియట్ సినిమాకు మాత్రుక కావడం గమనార్హం. మొత్తంగా పునీత్ రాజ్‌కుమార్ నటించిన 29 చిత్రాలలో 6 బ్లాక్‌బస్టర్ హిట్లు కాగా 15 సూపర్ హిట్లు, అలాగే 5 సినిమాలు ఏవరేజ్ గానూ కెవలం 4 సినిమాలు మాత్రమే ప్లాప్‌గా నిలిచాయి. ఇలా తన కెరీర్లో 87% సక్సెస్ గ్రాఫ్ పునీత్ రాజ్‌కుమార్ సొంతం. తన నటన, డ్యాన్స్‌లతో లక్షలాది మంది అభిమానులను ఉర్రూతలూగించిన కన్నడ పవర్ స్టార్ ఇప్పుడు తమ మద్య లేక పోవడంతో తన అభిమానులతో పాటు యావత్ సినీ లోకం శోక సంద్రంలో మునిగి పోయింది. -
కన్నడ చిత్రాలకు అవార్డుల పంట
సాక్షి బెంగళూరు : 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కన్నడ సినిమాలు పంట పండించాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 అవార్డులను కన్నడ సినిమాలు దక్కించుకున్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రముఖ నటి శ్రుతి హరిహరన్ నటించిన నాతిచరామి సినిమా అత్యధిక అవార్డులను దక్కించుకుంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేజీఎఫ్ సినిమా ఉత్తమ యాక్షన్ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. నాతిచరామి సినిమాకు మొత్తం5 అవార్డులు, కేజీఎఫ్ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. అలాగే ప్రముఖ కథానాయకుడు రిషబ్ శెట్టి నటించిన ‘సర్కారి హిరియ ప్రాథమిక శాలె కాసరగోడు’ చిత్రం కూడా అవార్డును గెలుచుకుంది. ఈసారి ఏకంగా 11 అవార్డులను దక్కించుకుంది. కన్నడ చలనచిత్ర చరిత్రలో ఇంతటిస్థాయిలో కర్ణాటకకు అవార్డులు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముంబైలోని శాస్త్రి భవన్ హాల్లో ఈ అవార్డులను అందజేశారు. మొత్తం 31 విభాగాల్లో పురస్కారాలను ఇచ్చారు. కాగా, నాతిచరామి సినిమాలో చక్కని నటనకు గాను ప్రత్యేక అవార్డు పొందిన శ్రుతి హరిహరన్ సంతోషం రెట్టింపయింది. ఒకవైపు అవార్డు వచ్చిన ఆనందం కాగా, మరోవైపు తన జీవితంలో ఒక పండంటి ఆడబిడ్డకు శ్రుతి హరిహరన్ జన్మనిచ్చారు. కన్నడ సినిమాల అవార్డుల జాబితా 1. ఉత్తమ ప్రాంతీయ చిత్రం నాతిచరామి 2. ఉత్తమ మహిళా గాయని – బింధు మాలిని (నాతిచరామి–మాయావి మానవే హాడు) 3. ఉత్తమ సాహిత్యం – నాతిచరామి 4. ఉత్తమ ఎడిటింగ్ – నాతిచరామి 5. ఉత్తమ సాహస చిత్రం – కేజీఎఫ్ 6. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ చిత్రం – కేజీఎఫ్ 7. ఉత్తమ జాతీయ ఏకత్వ చిత్రం – ఒందల్ల, ఎరడల్ల 8. ఉత్తమ బాల నటుడు – పీవీ రోహిత్ (చిత్రం– ఒందల్ల, ఎరడల్లా) 9. ఉత్తమ బాలల చిత్రం – ‘సర్కారీ హిరియ ప్రాథమిక శాలే కాసరగోడ 10. ఉత్తమ చిత్రం– మూకజ్జియకనసుగళు 11. ప్రత్యేక అవార్డు – నాతిచరామి చిత్రానికి గాను శ్రుతి హరిహరణ్ -
శాండిల్‌వుడ్‌లో తెలుగుతేజం
పబ్లిసిటీ డిజైనర్‌గా రాణిస్తూ దర్శకత్వం వైపు అడుగులు బెంగళూరు(బనశంకరి) : కన్నడ చలన చిత్ర రంగంలో ప్రవేశించిన ఓ ప్రవాసాంధ్రుడు పబ్లిసిటీ డిజైనర్‌గా రాణిస్తూ దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. తెలుగు తేజమైన ఎన్పీ తులసీ సీతారామ్రాజ్ కన్నడ చిత్ర పరిశ్రమలో పబ్లిసిటీ డిజైనర్‌గా స్థిరపడి తాజాగా ఓ కన్నడ చిత్రానికి దర్శకత్వం చేయనున్నారు. 24 ఏళ్ల తులసీరామ్ అనంతపురం జిల్లా పుట్టపర్తి తాలూకా నాగిశెట్టిపల్లికి చెందిన వారు. ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడు. 2014లో కన్నడ సినిమా రంగంలో అడుగుపెట్టి ఎవరి అండదండలు లేకుండా స్వశక్తితో తన సాంకేతిక పరిజ్ఞానంతో కన్నడ సినిమా పోస్టర్స్, పేర్లను తనదైనశైలిలో డిజైనింగ్ చేస్తూ కన్నడ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. కన్నడ రంగంలో రాణించాలనే ఉద్దేశంతో సొంతంగా ఏపీఎస్ అనే సంస్థను నెలకొల్పారు. దాదాపు 26 చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా, చిత్ర నిర్మాణ పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్వహించారు. అంతేగాక గత ఏడాది సూపర్‌హిట్ కన్నడ సినిమాలైన గూళిహట్చి, పరమశివ, కోలాహల, మిర్చిమండక్కిఖడక్చాయ్, బిలియన్ డాలర్ బేబీ, పస్ట్ర్యాంక్రాజు తదితర సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పనిచేశారు. కామెడీ చిత్రం ‘ఫస్ట్ర్యాంక్రాజు’ తులసీరామ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా తులసీరామ్ సాక్షితో మాట్లాడుతూ... తెలుగు సినీరంగంలో క్రియేటిక్ డెరైక్టర్‌గా రాణిస్తున్న ఎస్ఎస్.రాజమౌళిని ఆదర్శంగా తీసుకుని తాను కన్నడ సినిమా రంగంలోకి ప్రవేశించానన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి తాలూకా నాగశెట్టిపల్లి తన స్వస్ధలం అయినప్పటికీ బెంగళూరు నగరంలోనే సివిల్ ఇంజనీరింగ్‌ను పూర్తి చేశానని చెప్పారు. మాతృభాష తెలుగు అయినప్పటికీ కన్నడ సినిమా రంగంలో అడుపెట్టడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. కన్నడ, తెలుగు భాషల్లో ఉత్తమ సినిమాలు రూపొందించాలన్నదే తన ధ్యేయమన్నారు. ఈ ఏడాది తన చేతిలో ఉడుంబ, పంద్య, జీనియస్ తదితర సినిమాలకు పబ్లిసిటీ డిజైనింగ్ చేయనున్నట్లు చెప్పారు. అలాగే తన స్వీయ దర్శకత్వంలో ఫిబ్రవరి రెండవ వారంలో కన్నడ చిత్ర ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. కన్నడలో పౌరాణిక చిత్రం తీయాలనేది తన లక్ష్యమని చెప్పారు. రవిచంద్రన్ హీరోగారూపొందించిన పరమశివ అనే సినిమాకు 2015 సంవత్సరం ఉత్తమ డిజైనర్ గా అవార్డు దక్కడం తనకు మరచిపోలేని అనుభూతి అన్నారు.