సహనటి ఇంటిలో చోరీ చేసిన బుల్లితెర నటి
బెంగళూరు : సహనటి ఇంటిలో చోరీ చేసిన బుల్లితెర నటిని రాజరాజేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేశారు. మాంగల్య, రంగోలి తదితర కన్నడ సీరియల్స్‌లో నటించిన సుజాత బసవరాజ్ అనే బుల్లితెర నటిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే సుజాత, కవన ...కన్నడ బుల్లితెర నటులే కాకుండా ఇద్దరూ మంచి స్నేహితులు.
గత ఏడాది ఏప్రిల్‌లో కవనకు శస్త్ర చికిత్స జరిగింది. ఆ సమయంలో కవన ఇంటిలో రూ.1.75 లక్షల విలువైన బంగారు నగలు చోరీ అయ్యాయి. దీంతో కవనకు సుజాతపై అనుమానం వచ్చింది. రాజరాజేశ్వరీ నగర పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో సుజాతను పోలీసులు విచారించినా ఫలితం లేకపోయింది. దాంతో ఆమెపై నిఘా వేశారు.
తమకు లభించిన ఆధారాల మేరకు చివరకు సుజాతను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయటంతో బంగారు నగలు చోరీ చేసినట్లు ఆమె అంగీకరించింది. కాగా గతంలో కూడా సుజాతపై రెండు కేసులు నమోదు అయ్యాయని నిందితురాలిని బుధవారం కోర్టు ఎదుట హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.