తండ్రి భుజాల మీదే చనిపోయిన కొడుకు!
ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందకపోగా.. కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వకపోవడంతో 12 ఏళ్ల కుర్రాడు.. తన తండ్రి భుజం మీద పడుకునే ప్రాణాలు వదిలేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గల లాలా లజపతిరాయ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. సునీల్ కుమార్ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కొడుకు అంశ్ (12)ను తీసుకొచ్చినా, అతడిని ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగంలో చేర్చుకోడానికి నిరాకరించారు. పోనీ అక్కడకు దగ్గర్లో ఉన్న పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్దామంటే అతడికి స్ట్రెచర్ కూడా ఇవ్వలేదు. దాంతో కాలినడకనే పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. తండ్రి భుజాల మీదే ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు.
అంశ్ ఆదివారం రాత్రి నుంచి తీవ్ర జ్వరంతో బాధపడతున్నాడు. తొలుత స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించారు. కానీ పరిస్థితి బాగోకపోవడంతో అక్కడి వైద్యుల సలహా మేరకు నగరంలోనే అతిపెద్ద ఆస్పత్రి అయిన లాలా లజపతిరాయ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీలో చేర్చి కనీసం పరీక్ష చేయాలని తాను వైద్యులను ప్రాధేయపడ్డానని, పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లాలని తనకు చెప్పడానికి వాళ్లకు అరగంట పట్టిందని సునీల్ కుమార్ కన్నీళ్లతో చెప్పారు. ఆస్పత్రి పావు కిలోమీటరు దూరంలో ఉన్నా.. పిల్లాడిని పడుకోబెట్టి తీసుకెళ్దామని స్ట్రెచర్ అడిగినా కూడా ఇవ్వడం కుదరదని చెప్పేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ఆ పిల్లవాడు చనిపోయాడు. ఎవరూ సాయం చేయకపోవడంతో అతడి మృతదేహాన్ని భుజం మీద వేసుకుని నడుచుకుంటూనే ఇంటికి తీసుకెళ్లాడు.