Kanta
-
మద్రాస్ నేపథ్యంలో...
దుల్కర్ సల్మాన్ హీరోగా ‘కాంత’ సినిమా షురూ అయింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ– ‘‘ సురేశ్ ప్రోడక్షన్స్ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, మా స్పిరిట్ మీడియాతో కొత్త శకానికి నాంది పలికేందుకు సరైన చిత్రం ‘కాంత’. సోమవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం’’ అన్నారు.‘‘మానవ భావోద్వేగాల లోతులను ఆవిష్కరించే అందమైన కథ ‘కాంత’’ అని దుల్కర్ సల్మాన్ తెలిపారు. ‘‘1950 మద్రాస్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. మానవ బంధాలు, సామాజిక మార్పులతో గొప్ప అనుభూతిని పంచేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని సెల్వమణి సెల్వరాజ్ పేర్కొన్నారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సాయికృష్ణ గద్వాల్, లైన్ ప్రోడ్యూసర్: శ్రవణ్ పాలపర్తి, కెమెరా: డాని శాంచెజ్ లోపెజ్, సంగీతం: జాను.దుల్కర్ చేతికి ‘క’ మలయాళ రిలీజ్ హక్కులుకిరణ్ అబ్బవరం హీరోగా నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘క’. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలో విడుదలకానుంది. కాగా ‘క’ సినిమా మలయాళ థియేట్రికల్(వరల్డ్ వైడ్) రైట్స్‌ను హీరో దుల్కర్ సల్మాన్ ప్రోడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది. -
నకిలీ కమిషన్ వ్యాపారి అరెస్ట్
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో లైసెన్సులు లేకుండా రైతుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న నకిలీ కమీషన్ వ్యాపారిని మార్కెట్ అధికారులు శనివారం వల పన్ని పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బంజర గ్రామానికి చెందిన చెవిటి రాము, కొంతకాలంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కమీషన్ వ్యాపారిగా చెలామణవుతున్నాడు. రైతు పంటను దడవాయిలు కాంటా పెట్టి కాంటా చిట్టాల్లో నమోదు చేస్తారు. ఆ చిట్టా పుస్తకాలను మార్కెట్ కమిటీ లైసెన్స్డ్ దడవాయిలకు ఇచ్చి కాంటాలు పెట్టిస్తారు. ఆ కాంటా పుస్తకాలకు ఇతడు నకిలీవి సృష్టించి మోసగిస్తున్నాడు. ఇతడిని జనవరి 3న పత్తి కొనుగోళ్లలో మార్కెట్ అధికారులు గుర్తించారు. అతడిని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీకు పర్సన్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్(జేసీ) టి.వినయ్‌కృష్ణారెడ్డి వద్ద హాజరుపరిచారు. జేసీ హెచ్చరించి వదిలేశారు. అయినప్పటికీ ఆ నకిలీ వ్యాపారి మళ్లీ వచ్చాడు. కామేపల్లి మండలం నెమిలిపురి గ్రామానికి చెందిన బన్సీలాల్ అనే రైతు నుంచి మిర్చి కొనుగోలు చేస్తూ ఫిబ్రవరి 28న మరోసారి పట్టుబడ్డాడు. ఆ రైతును కాంటాల్లో మోసగించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. జేసీ ఆదేశాలతో ఆ నకిలీ వ్యాపారిని ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి నకిలీ కాంటా చిట్టా పుస్తకాలను, ఖమ్మంలోగల దుకాణం నుంచి డాక్యుమెంట్లను స్వాధీనపర్చుకున్నారు. ఇతడికి సహకరిస్తున్న నకిలీ గుమస్తా సుజిత్‌ను కూడా మార్కెట్ అధికారులు విచారిస్తున్నారు. మరో నకిలీ వ్యాపారి గుర్తింపు రాము మాదిరిగానే, మరో నకిలీ కమీషన్ వ్యాపారిని కూడా మార్కెట్ అధికారులు గుర్తించారు. ఇతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని సమాచారం. మార్కెట్ సమీపంలోగల ఇతడి దుకాణాన్ని సీజ్ చేసేందుకు మార్కెట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం ఈ నకిలీ కమీషన్ వ్యాపారులపై మార్కెట్ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా మార్కెటింగ్ అధికారి రత్నం సంతోష్‌కుమార్ చెప్పారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఇద్దరిని, వీరికి సహకరిస్తున్న వారిని గుర్తించామన్నారు. నకిలీ కాంటా చిట్టాలను ప్రింట్ చేస్తున్న వారిని కూడా గుర్తించినట్టు చెప్పారు. వీరిపై ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. -
చుక్ చుక్ డమ్ డమ్
డమ్ డమ్ రైల్వేస్టేషన్‌కి చుక్ చుక్ బండ్లు ఎన్నో వస్తాయి. చీదరించుకున్నా, చికాకుపడ్డా, ఛీ కొట్టినా, ఛ ఛ అన్నా... బండి వస్తుంది. అంతేకాదండోయ్... బుర్ర బద్దలు కొట్టినా, ప్రాణం తీస్తామన్నా ఆగక సాగే చదువుల బండీ వస్తోంది! ఒకప్పుడు రిజర్వేషన్ లేకుండా వెయిటింగ్ లిస్టులో ఉన్న పిల్లల భవిష్యత్తు... రిజర్వుడు కంపార్ట్మెంటులో చక్కటి ప్రయాణం చేస్తోంది. డం డం రైల్వే ప్లాట్‌ఫామ్ మీ చుక్ చుక్మంటున్న బండి ఇది. మన బడికైతే గంట మోగుతుంది. ఇక్కడ సరస్వతీదేవి కూతపెట్టింది. ఛీ కొట్టండి.. చదవకుండా ఉండండి చూద్దాం. ఎప్పటిలాగే స్కూల్ అయిపోగానే ఇంటికెళ్లడం కోసం డమ్ డమ్ స్టేషన్‌కు చేరుకుంది కాంతాచక్రవర్తి. బెడియపారా లోకల్ ట్రైన్ కదలడానికి సిద్ధంగా ఉంది. దాన్ని అందుకోవడం కోసం ప్లాట్‌ఫామ్‌వైపు పరుగెత్తుతోంది కాంత. అంతలోపే అంతే వేగంగా పది, పదకొండేళ్ల ఆడపిల్లలిద్దరు ఆమె దారికి అడ్డం పడుతూ.. చేయి చాచారు. వాళ్లకేసి చిరాగ్గా చూసింది కాంత. ‘ఛల్ హట్... మీతోటి పిల్లలంతా స్కూళ్లకెళుతుంటే మీరిట్లా రైల్వేస్టేషన్లలో, బస్టాండుల్లో అడుక్కోవడానికి సిగ్గేయట్లేదా? డబ్బులివ్వను.. చదువు చెప్తా... చదువుకుంటారా?’ అంది కాంత కోపం, విసుగు కలగలిసిన గొంతుతో. ‘సరే... చదువుకుంటాం’ అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తారు వాళ్లు. ‘చదువనగానే పారిపోయారు..’ అనుకుంటూ బెడియపారా ట్రైన్ ఎక్కేసింది కాంత. కాంతాచక్రవర్తి కోల్‌కతా, డమ్‌డమ్ రైల్వేస్టేషన్ దగ్గర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్. ప్రతిరోజూ బెడియపారా నుంచి డమ్డమ్కు లోకల్ ట్రైన్లోనే వెళ్తుంది. బెడియపారా, డమ్ డమ్ స్టేషన్లలో భిక్షాటన చేస్తున్న ఇలాంటి పిల్లల్ని చూసి జాలి పడుతుంది. ఆ జాలి లోంచి వచ్చిన అసహనమే అది. కానీ జరిగింది వేరు! ఆ మర్నాటి నుంచి వరుసగా నాలుగు రోజులు... సాయంత్రం అయిదు గంటల సమయంలో కాంతాచక్రవర్తికోసం ఎదురు చూశారు ఆ ఇద్దరు పిల్లలు. ఆమె కనిపించలేదు. అయిదో రోజూ.. ఎప్పటిలా ఆశగా టీచరమ్మకోసం డమ్‌డమ్ రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ప్లాట్‌ఫామ్ మీదికి వచ్చేవాళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. చిలకాకుపచ్చ రంగు బెంగాలీ కాటన్ చీరలో, నల్లరంగు హ్యాండ్‌బ్యాగ్‌తో అదే హడావిడితో వస్తున్న ఓ అమ్మ కనిపించింది. పోల్చుకోవడానికి ఒక్క క్షణమే పట్టింది ఆ పిల్లలకు. అంతే... పరుగున ఆమె దగ్గరకు చేరారు. చెరోపక్క నిలబడ్డారు. ‘చదువు చెప్తానని ఈ నాలుగు రోజులు రాలేదే.. నీ కోసం ఎంత ఎదురుచూశామో’ అంటూ మెరిసే కళ్లతో అడిగారు. వాళ్లేం మాట్లాడుతున్నారో కాంతకు అర్థంకాలేదు. ‘ఎవరు మీరు?’ అన్నట్లుగా చూసింది. ఆ చూపు అర్థమైన పిల్లలు.. ‘నాలుగు రోజుల కిందట.. ఇక్కడే.. మేం డబ్బులడిగితే.. అడుక్కోవడానికి సిగ్గులేదా? చదువు చెప్తా.. చదువుకుంటారా?’ అని కోప్పడ్డారు కదమా.. మా ఇద్దర్నే.. గుర్తులేదా?’ అన్నారు గుర్తుకుతెచ్చే ప్రయత్నం చేస్తూ! గుర్తొచ్చింది కాంతాకు. ‘ఆ.. అవును. అయితే ఇప్పుడేంటి?’ అంది అంతే చిరాగ్గా. ‘చదువుకుంటాం.. చెప్పు. నువ్వు ఆ మాట అన్నప్పటి నుంచి అడుక్కోవడం మానేశాం’ అన్నారిద్దరూ. అప్పుడు చూసింది వాళ్లను నిశితంగా. అప్పుడు గమనించింది.. ఆ పసిబుగ్గల మీది గాయాలను.. చేతులకు ఉన్న గాట్లను! కాంత మనసు చివుక్కుమంది. ‘ఈ దెబ్బలేంటి?’ అంది ఆ అమ్మాయిల బుగ్గలను తడుముతూ. ‘అడుక్కొని డబ్బులు తేవట్లేదని మావాళ్లు కొట్టారు’ అన్నారిద్దరూ... ఇది మాకు అలవాటే అన్నట్లుగా. కాంత కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్రయత్నంగా ఇద్దరినీ దగ్గరకు తీసుకుంది. ‘ఇప్పుడే మొదలుపెడ్దామా?’ అంది. ‘ఊ’ అంటూ తలాడించారు ఇద్దరూ! అక్కడే.. ఆ ప్లాట్‌ఫామ్ మీదే.. ఓ వారగా కూర్చోని వాళ్లకు అక్షరాభ్యాసం చేసింది కాంతాచక్రవర్తి.ఇది 2007 నాటి సంఘటన. ఇద్దరు వీధిపిల్లలతో మొదలైన ప్లాట్‌ఫామ్ మీద ఆ టీచరమ్మ బడి ఈ ఎనిమిదేళ్లలో 20 మందికి చేరింది. ఏడు నుంచి పదిహేనేళ్లలోపు ఆడపిల్లలే అంతా. మొదట్లో నలుగురు పిల్లలే ఉన్నప్పుడు బెంగాలీ ఒక్కటే నేర్పేది కాంత. ఎప్పుడైతే వాళ్ల సంఖ్య అయిదుకు మించిందో అప్పటి నుంచి బెంగాలీతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలనూ చేర్చింది. తర్వాత వాళ్ల ఆసక్తిని పసిగట్టి లెక్కలు, సైన్స్ కలిపింది. అయితే.. ఇది అంత తేలిగ్గా జరగలేదు! ఇద్దరు నుంచి నలుగురు అమ్మాయిలు కాంత దగ్గర చేరాక వాళ్ల తల్లిదండ్రుల నుంచి కాంతకు బెదిరింపులు ఎదురయ్యాయి. పట్టించుకోలేదు. ఒకరోజు బెడియపారాలో ట్రైన్ దిగిన కాంత మీద దాడి జరిగింది. తలపగల గొట్టారు. ఆమె బ్యాగ్‌లో ఉన్న పుస్తకాలను చించేశారు. పర్సులో ఉన్న డబ్బుల్ని ఎత్తుకుపోయారు. మెడలో ఉన్న గొలుసూ పోయింది. స్పృహతప్పి పడిపోయిన కాంతను ఆ ప్రాంత వాసులు గుర్తించి ఆమె భర్తకు కబురుపంపారు. కాంతను హాస్పిటల్ తీసుకెళ్లాడు ఆమె భర్త. గాయం తగ్గాక ‘మేలు చేయాలనుకుంటే కీడు జరుగుతోంది. వద్దులే ఆపేయ్’ అన్నాడు భర్త. అయితే కాంత ఒప్పుకోలేదు. ‘వాళ్లంతా మన బిడ్డలు అన్నావ్.. బిడ్డలు చెడిపోతుంటే చూస్తూ ఊరుకుందామా? వాళ్లు నన్ను చంపినా పాఠం ఆపను’ అంది నిశ్చయంగా. ఆ రోజు నుంచి కాంత, వాళ్లాయనా చదువు చెప్పడం మొదలుపెట్టారు. ఈ పిల్లలను నన్ను టీచరమ్మను మాత్రమే కాదు అమ్మను కూడా చేశారు. నాకు దేవుడిచ్చిన బిడ్డలయ్యారు’ అంటుంది పిల్లలు లేని కాంతాచక్రవర్తి. కాంత తపన చూసి రైల్వే అధికారులు, డమ్‌డమ్ హాకర్స్ యూనియన్ వాళ్లు స్టేషన్‌లోని ఓ గదిని క్లాస్‌రూమ్‌గా కేటాయించారు. స్థానికంగా ఉన్న కొన్ని ఎన్జీవోలు కలిసి ఈ పిల్లల కోసం ఓ వ్యాన్ని ఏర్పాటు చేసి, ఓ డ్రైవర్నీ నియమించారు. ఇంకొంత మంది పుస్తకాలను డొనేట్ చేస్తున్నారు. అలా ఇప్పుడు ఆ పిల్లలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా చదువుకుంటున్నారు. ‘ఇదంతా టీచరమ్మ భిక్ష’ అని ఆ పిల్లలు అంటే.. ‘కాదు ఇది ఈ పిల్లల హక్కు’ అని ఆ టీచరమ్మ అంటుంది.