మొసలితో పోరాడి...కుమార్తెను రక్షించుకుంది
వడోదరా: ఓ మహిళ ధైర్య సాహసాలు ప్రదర్శించి మొసలి బారిన పడిన కుమార్తెను రక్షించిన సంఘటన గుజరాత్లో శుక్రవారం చోటు చేసుకుంది. వడోదరాలోని పడ్రా పట్టణ సమీపంలోని తికారియంబరక్ గ్రామ సమీపంలోని విశ్వామిత్ర నది ప్రవహిస్తుంది. ఆ నదిలో బట్టలు ఉతుకునేందుకు కంతా వాంకర్ (19) ఎప్పటిలాగే శుక్రవారం కూడా నది వద్దకు చేరుకుని... బట్టలు ఉతకడం ప్రారంభించింది. అంతలో నదిలోని మొసలి ఆమె కాలును నోట కరచి అమాంతంగా నదిలోకి లాగింది. దీంతో అక్కడే ఉన్న ఆమె తల్లి దీపాలి వెంటనే స్పందించి.... బట్టలు ఉతికే బ్యాట్ (క్రికెట్ బ్యాట్ ఆకారంలో ఉంటుంది) తో మొసలి తలపై దాదాపు 10 నిమిషాలు ఏకధాటిగా బలంగా కొట్టింది.
దాంతో మొసలి కుమార్తె కాంత వాంకర్ కాలు వదిలి నదిలోకి జారుకుంది. దీపాలి వెంటనే కుమార్తెను ఆసుపత్రికి తరలించింది. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విశ్వామిత్ర నదిలో దాదాపు 260 మొసళ్లు ఉన్నట్లు ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గణాంకాల ద్వారా తెలిందని అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. నదిలో పరివాహాక ప్రాంతంలో బట్టలు ఉతకవద్దని గ్రామస్తులకు అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.