Kapil Wadhawan
-
డీహెచ్ఎఫ్ఎల్ ఉత్తుత్తి గృహ రుణాలు..
న్యూఢిల్లీ: లబ్ధిదారులతో సంబంధం లేకుండా ఉత్తుత్తి (కల్పిత) గృహ రుణ ఖాతాలను సృష్టించి వాటిపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) సబ్సిడీలను డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ మింగేసినట్టు బయటపడింది. ఇందుకు సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు అయిన కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్, డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన గ్రాంట్ థార్న్టన్ సంస్థ ఈ మోసాలను వెలుగులోకి తీసుకొచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్ ముంబైలోని బాంద్రాలో కల్పిత శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా.. అప్పటికే గృహ రుణాలు తీసుకుని చెల్లించేసిన రుణ ఖాతాలను ఉత్తుత్తి శాఖలోని డేటాబేస్‌లో చేర్చింది. 2007–19 మధ్య ఇందుకు సంబంధించి 2.60 లక్షల నకిలీ ఖాతాలను సృష్టించి రూ.14,046 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చూపింది. రూ.11,756 కోట్లను ఇలా దారిమళ్లించినట్టు బయటపడింది. -
డీహెచ్ఎఫ్ఎల్లో బయటపడ్డ మరో భారీ మోసం
న్యూఢిల్లీ: దివాలా తీసిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్)లో తవ్విన కొద్దీ మోసాలు బైటపడుతూనే ఉన్నాయి. తాజాగా రూ. 6,182 కోట్ల మేర విలువ చేసే అక్రమ లావాదేవీలను ఆడిటింగ్ సంస్థ గ్రాంట్ థార్న్టన్(జీటీ) గుర్తించింది. ‘అసలు విలువ తగ్గించి చూపేలా, మోసపూరితంగా, పక్షపాత ధోరణితో వ్యవహరించిన విధంగా‘ కొన్ని లావాదేవీలు జరిగినట్లు కంపెనీ అడ్మినిస్ట్రేటరుకు ఆడిటర్ నుంచి ప్రాథమిక నివేదిక వచ్చినట్లు స్టాక్ ఎక్స్చేంజిలకు డీహెచ్ఎఫ్ఎల్ వెల్లడించింది. ‘సుమారు రూ. 5,382 కోట్ల అసలు రుణం, రూ. 589 కోట్ల వడ్డీ బకాయి, తక్కువ వడ్డీ రేటు విధించడం వల్ల రూ. 211 కోట్ల మేర నష్టం.. అంతా కలిపి దాదాపు రూ. 6,182 కోట్ల మేర ప్రభావం చూపే విధంగా మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ట్రాన్సాక్షన్ ఆడిటర్ నివేదికలో పేర్కొంది‘ అని కంపెనీ పేర్కొంది. ఈ లావాదేవీలన్నీ కొన్నేళ్ల పాటు క్రమంగా జరిగాయని గ్రాంట్ థార్న్టన్ వివరించింది. జీటీ నివేదిక ఆధారంగా.. కంపెనీ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్‌లతో పాటు క్రియేటజ్ బిల్డర్స్, ఇక్షుదీప్ ఫిన్‌క్యాప్, రైట్ డెవలపర్స్ తదితర సంస్థలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో అడ్మినిస్ట్రేటర్ పిటిషన్ దాఖలు చేశారు. పలు మోసాలు బైటపడిన నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ దివాలా తీయడం, కంపెనీ నిర్వహణను ప్రస్తుతం అడ్మినిస్టేటర్‌కు అప్పగించడం తెలిసిందే. రూ.14,046 కోట్ల మేర నిధులు గోల్మాల్ చేసిందని డీహెచ్ఎఫ్ఎల్పై ఆరోపణలు ఉన్నాయి. 2020 డిసెంబర్లో రూ.1,058 కోట్ల మోసపూరిత లావాదేవీల వ్యవహారం బయటపడింది. చదవండి: ఫిబ్రవరిలో ఎఫ్‌పిఐ పెట్టుబడులు వెల్లువ ఇక నుంచి ఆన్లైన్లో స్ట్రీట్ ఫుడ్ -
ఆస్తులమ్మి అప్పులు తీర్చేస్తాం
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ తమ చేయి జారకుండా ప్రమోటర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సుమారు రూ. 43,000 కోట్ల విలువ చేసే తమ వ్యక్తిగత, కుటుంబ ఆస్తులను విక్రయించైనా రుణదాతల బాకీలు తీర్చేస్తామని జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ప్రమోటర్ కపిల్ వాధ్వాన్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మిని స్ట్రేటర్ ఆర్ సుబ్రమణియ కుమార్‌కు ఈ మేరకు లేఖ రాశారు. రుణ బాకీలు తీర్చేసే దిశగా.. తమ కుటుంబానికి వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న వాటాలను, హక్కులను బదలాయిస్తామని వాధ్వాన్ ప్రతిపాదించారు. 2018 సెప్టెంబర్ నాటి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం కారణంగా డీహెచ్ఎఫ్ఎల్తో పాటు పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు కుదేలయ్యాయని ఆయన తెలిపారు. కష్టకాలంలోనూ వివిధ అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా డీహెచ్ఎఫ్ఎల్ దాదాపు రూ. 44,000 కోట్లు చెల్లించిందని వివరించారు. మనీలాండరింగ్, నిధుల గోల్మాల్ వంటి ఆరోపణలపై డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్, ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. బాకీలను రాబట్టుకునే క్రమంలో రుణదాతలు .. డీహెచ్ఎఫ్ఎల్ని వేలానికి ఉంచగా ఓక్ట్రీ, ఎస్సీ లోవీ తదితర సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. -
పెట్టుబడులు పెంచేలా బడ్జెట్ ఉండాలి: డీహెచ్ఎఫ్ఎల్
హైదరాబాద్: విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా భారత్‌ను కేంద్రం తీర్చిదిద్దుతోందని డీహెచ్ఎఫ్ఎల్ సీఎండీ కపిల్ వాధ్వాన్ పేర్కొన్నారు. ఈ దిశగానే అరుణ్ జైట్లీ నేడు సమర్పించే బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బడ్జెట్లో పన్నులకు సంబంధించిన అస్పష్టతలను తొలగించాలని పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులు పెట్టేలా చర్యలుండాలని వివరించారు. మౌలిక, విద్య, ఆరోగ్య, గృహ నిర్మాణ రంగాల్లో విదే శీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగాల్సిన అవసరముందని తెలిపారు. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనేలా, పెట్టుబడుల జోరును పెంచేలా బడ్జెట్ ఉండాలని సూచించారు. -
డీహెచ్ఎఫ్ఎల్ అంబాసిడర్ షారూక్
హైదరాబాద్: ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, డీహెచ్ఎఫ్ఎల్కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినిమా నటుడు షారూక్ ఖాన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు షారూక్ ఖాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని డీహెచ్ఎఫ్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కపిల్ వాధ్వాని ఒక ప్రకటనలో తెలిపారు. తమ 30 ఏళ్ల ప్రస్థానంలో ఒక బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించుకోవడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. భారత్‌లో రెండో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా అవతరించామని వివరించారు. సొంత ఇల్లు సాధించడమనేది ప్రతి కుటుంబానికి భద్రమైన భవిష్యత్తుకు తొలి మెట్టు అని, దీని కోసం తోడ్పడే డీహెచ్ఎఫ్ఎల్కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందని షారూక్ ఖాన్ పేర్కొన్నారు.