kapilavai linga murty
-
కందనూలు కవితా కుసుమం కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/కందనూలు: సాహితీరంగంలో తనదైన ముద్రవేస్తూ కందనూలు (నాగర్‌కర్నూల్) జిల్లా ఖ్యాతిని నలుదిశలా విస్తరింపచేసిన ప్రముఖ కవి కపిలవాయి లింగమూర్తి (90) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట తాలుకా జీనుకుంట గ్రామంలో 1928 మార్చి 31న జన్మించిన కపిలవాయి లింగమూర్తి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగు పూర్తిచేశారు. ఆ తర్వాత 1954లో ఉపాధ్యాయుడిగా, 1972లో కళాశాల ఉపన్యాసకుడిగా చేరి 1983లో ఉద్యోగ విరమణ పొందారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని పలు పర్యాటక, చారిత్రక ప్రదేశాలు, ఆలయాలకు కథలకు ఆయన ప్రాణం పోశారు. ఆయన రచనల్లో మొత్తం 70 రచనలు ముద్రితమయ్యాయి. ఇందులో తిరుమలేశ శతకం, పాలమూరు జిల్లా దేవాలయాలు, జినుకుంట రామబంటు శతకం వంటివి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సాహిత్యం, చరిత్ర, పురావస్తుశాస్త్రంపై వందకు పైగా గ్రంధాలు రాశారు. ఆయన రాసిన వాటిలో పాలమూరు జిల్లా దేవాలయాలు, సాలగ్రామ శాస్త్రం, మాంగళ్య శాస్త్రం, ఆర్యా శతకం, సోమేశ్వర క్షేత్ర మహత్యం, సుందరీసందేశం, పద్యకథాపయనం, శ్రీరుద్రాధ్యయం తదితర గ్రంధాలు ప్రముఖమైనవి. కవిల కళానిధి, కవి కేసరి, వేదాంత విశారద, గురుశిరోమణి, సాహిత్య స్వర్ణ సౌరభ వంటి బిరుదులను అందుకున్నారు. ఇక 2014లో కవి కాళోజీ నారాయణరావు పురస్కారం, 2018లో దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 2014 ఆగస్టులో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈనెల 8వ తేదీ ఉదయం లింగమూర్తి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, రాష్ట్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, తెలుగు విశ్వద్యాలయం వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, ప్రముఖ కవి గోరటి వెంకన్న, తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ వేదకుమార్ ఉన్నారు. ముఖ్యమంత్రి సంతాపం కపిలవాయి లింగమూర్తి మృతి పట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సాహితీ రంగంలో కపిలవాయి చేసిన విశేష కృషిని సీఎం గుర్తు చేసుకున్నారు. -
సాహిత్య భీష్ముడికి డాక్టరేట్
పండిత కవిగా, ప్రముఖ పరిశోధకులుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తికి గౌరవ డాక్టరేట్ లభించింది. సాహితీరంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన హైదరాబాద్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆయనకు గౌరవ పురస్కారం అందజేసింది. పాలమూరు జిల్లా సాహితీవనంలో కలికితురాయిగా, సాహిత్య భీష్ముడిగా పేరొందిన ఆయన చిన్నతనం నుంచి పేదరికాన్ని అనుభవిస్తూనే అంచెలంచెలుగా ఎదిగి సాహితీ రంగానికి వన్నెతెచ్చారు. నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన ఈ సాహిత్య భీష్ముడు 84ఏళ్ల పడిలో ఉన్నా నేటికీ కలం కదిలించనిదే పొద్దుగుంకనివ్వడు. నిరంతర పరిశోధకుడిగా ఉంటూ ఎన్నో రచనలు చేసిన కపిలవాయి సాహితీ అభిమానులకు, ఎందరో విద్యార్థులకు గురువుగా మారారు. పాలమూరు దేవాలయాల చరిత్ర, శాసనాలు, మరెన్నో సాహిత్య అంగాలను పరిశోధన చేసి పుస్తకరూపం ఇచ్చిన ఆయన నడిచే గ్రంథాలయంగా మారారు. ఆయన పై పరిశోధనలు చేసి ఎందరో ఎంఫిల్ సాధిం చారు. పాలమూరు జిల్లా విజ్ఞాన సర్వస్వంగా చరిత్రకారులు కపిలవాయిని విశ్లేషిస్తారు. 14సంవత్సరాల చిరుప్రాయంలోనే రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించిన కపిలవాయి పద్యం, గద్యం, వచన కవితలు, గేయాలు, నాటకాలు, కథలు, నవలలు, సంకీర్తనలు, హరికథలు, చారిత్రక కావ్యాలు, వ్యాఖ్యానాలు, చిత్రకవిత్వం, పరిష్కరణాలు, ద్విపదాలు, ఉదాహరణ ప్రక్రియలు లాంటి దాదాపు 80వరకు రచించారు. తాళపత్ర గ్రంథ సేకరణ, విశ్లేషణలో కూడా ఆయన నేర్పరి. సన్మానాలు.. పురస్కారాలు కపిలవాయి ఎన్నో బిరుదులు, అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. కవితా కళానిధి, పరిశోధక పంచానన, కళాకేసరి లాంటి బిరుదులు ఆయన కృషితో లభించిన వాటిలో కొన్ని. దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిలతోపాటు గవర్నర్లు, ప్రముఖ కళా వేదికలు, సాహిత్య సంస్థల నుంచి సన్మానాలు అందుకున్నారు. కపిలవాయి రచనలు భాగవత కథాతత్వం, ఆలగ్రామ శాస్త్రం, పాలమూరు జిల్లా దేవాలయాలు, శ్రీ మత్ప్రతాపరిగి ఖండం, కుటుంబగీత, మాంగళ్య శాస్త్రం, దుర్గా భర్గా శతకాలు, ఆర్యా శతకం, స్వర్ణ శకలాలు, గీతాచతుష్పదం, రుధ్రాధ్యాయం, యోగాసక్తా పరిణయం, యయాతి చరిత్రలతోపాటు మరో 70 కావ్యాలను, సుమారు వందకుపైగా పరిశోధనలు, రచనలు ఉన్నాయి.