'స్పీకర్ నిర్ణయానికి అందరూ తలొగ్గాల్సిందే'
చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో నేడు చోటుచేసుకున్న సంఘటనలు చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ అన్నారు. ఈ గందరగోళ పరిస్థితులపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటే అది సభ్యులందరూ ఆమోదించాల్సిందేనని తెలిపారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ లోపల జరుగుతున్న ప్రొసీడింగ్స్‌ను టీవీల్లో చూపించకపోవడం, అప్రజాస్వామికమని మాజీ సుప్రీంకోర్టు జడ్జి మార్కెండేయ కట్జూ వ్యాఖ్యానించారు.
శశికళ వర్గానికి చెందిన సీఎం పళనిస్వామి బలనిరూపణ పరీక్ష సందర్భంగా డీఎంకే సభ్యులు తీవ్ర గందరగోళ పరిస్థితులు సృష్టించారు. స్పీకర్ పోడియంను డీఎంకే సభ్యులు చుట్టుముట్టి ఆయనపై, పేపర్లు, కుర్చీలు విసిరేశారు. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్ సభను ఒంటిగంట వరకు వాయిదా వేశారు. ప్రతిపక్ష తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. తిరిగి ఒంటిగంట తర్వాత సభ మళ్లీ ప్రారంభమైంది.