త్రీమంకీస్ - 53
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 53
మల్లాది వెంకటకృష్ణమూర్తి
కపీష్‌కి దూరం నుంచి సన్నగా వెలుగు కనిపించడంతో తను దాని చివరికి చేరుకున్నానని గ్రహించాడు. కొద్ది క్షణాల్లో కపీష్ తల సొరంగం కోసిన గుంటలోంచి రోడ్డు ఉపరితలం మీదకి వచ్చాక చుట్టూ పరిశీలనగా చూశాడు. కపీష్ చుట్టూ చూసి రోడ్డు రిపేర్‌లో ఉందని గ్రహించాడు. రోడ్ మీది సిమెంట్‌ని చెక్కేయడంతో మట్టి కనపడుతోంది. వాహనాలు రాకుండా రోడ్‌కి అటు, ఇటు తారు డ్రమ్ములు అడ్డుపెట్టి ఉన్నాయి. రోడ్ వేసే కంకర రాళ్ళ గుట్టలు రోడ్డుకి రెండు వైపులా పోసి ఉన్నాయి. ట్రాఫిక్ లేకపోవడంతో సొరంగం కంత ఎవరి దృష్టిలో పడదు. ఎవరి కంటైనా పడ్డా అది మేన్‌హోల్ అనుకుంటారు.
ఇద్దరు కానిస్టేబుల్స్ ఆ సొరంగానికి నాలుగు అడుగుల దూరంలో నిలబడి ఉండటం చూశాడు. వాళ్ళు నించుని అటు తిరిగి యూరిన్ పోస్తూండటం చూసి గుసగుసగా చెప్పాడు.
‘‘నిశ్శబ్దంగా బయటకి రండి.’’
మర్కట్, వానర్లు కూడా కపీష్ వెంట బయటకి వచ్చారు.
‘‘ష్! దూరంగా కనపడ్డ పోలీస్వేన్ని కపీష్ చూపించి సైగ చేశాడు.
అందులోకి పోలీసులు ఆరుగుర్ని ఎక్కించడం చూశాడు. వాళ్ళు, దుర్యోధన్, అతని అనుచరులు. పోలీసులకి తెలిసే మాటు వేశారా? లేక పెట్రోలింగ్ చేస్తూ ఆ సమయానికి అటుగా వచ్చారా? అతనికి అర్థం కాలేదు.
ముగ్గురూ ఓ రాళ్ళ గుట్ట వెనక్కి పాక్కుంటూ వెళ్ళారు. మీద రాళ్ళని కప్పుకున్నారు. ఓ ఎస్సై వేన్లోంచి తెచ్చిన రిబ్బన్ని ఆ కంత చుట్టూ కట్టాడు. ఆ రిబ్బన్ మీద పోలీస్ అన్న అక్షరాలు ముద్రించి ఉన్నాయి. టార్చిలైట్ వెలుగులో నేలంతా క్షుణ్ణంగా పరిశీలించాడు. మరో ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి కాపలాగా నిలబడితే కొందరు పోలీసులు ఒకరి వెనక మరొకరు అందులోకి దిగారు. కపీష్ పక్కనే ఉన్న పార్క్ వైపు చూపించి రమ్మని సైగ చేశాడు. ముగ్గురు ఒంగొని అటువైపు పరిగెత్తారు.
‘‘అబ్బ! ఇక్కడ గాలి ఎంత బావుంది?’’ మనసారా పీలుస్తూ వానర్ చెప్పాడు.
‘‘అది సులభ్ మీంచి వచ్చే గాలి గురూ’’ మర్కట్ చిరాగ్గా చెప్పాడు.
‘‘కాదు. స్వేచ్ఛా గాలి.’’
‘‘గ్రామర్ తప్పు. స్వేచ్ఛా వాయువు అనాలి. ఆ జైల్లో చచ్చాం. ’’
‘‘అదేం కాదు. చిన్న జైల్లోంచి పెద్ద జైల్లోకి వచ్చాం’’ కపీష్ చెప్పాడు.
‘‘మీ ఇద్దరి కన్నా నేను గ్రేట్’’ వానర్ చెప్పాడు.
‘‘ఏం?’’
‘‘చూడండి. వంద రూపాయలకే జైలు గార్డ్ వాచీని కొట్టేశాను’’ అక్కడ నించి కనిపించే జైలు గోడని చూస్తూ చెప్పాడు.
కొద్దిసేపట్లో ఆ ఏరియా ఏసీపీ, డీసీపీలు వచ్చారు. వాళ్ళ మాటలు వినిపించాయి.
‘‘ఎంతమంది తప్పించుకున్నారో తెలిసిందా?’’ ఓ అధికారి అడిగాడు.
‘‘మొత్తం తొమ్మిది మందిట సార్. ఆరుగుర్ని సొరంగంలోంచి బయటకి రాగానే పట్టుకున్నాం. ఇంకో ముగ్గురి కోసం వెదుకుతున్నాం.’’
‘‘ఆ పార్క్‌లో, చుట్టుపక్కల ఇళ్ళల్లో కూడా వెదకండి. ఆట్టే దూరం పారిపోయి ఉండరు’’ ఏసీపీ చెప్పాడు.
‘‘ఎస్సార్.’’
ఇద్దరు పోలీస్ కానిస్ట్టేబుల్స్, ఓ ఎస్సై పార్క్‌లోకి దారి తీశారు. అక్కడి పొదల్లో, గుబుర్లలో తుపాకీ బాయ్నెట్స్తో పొడిచి మరీ వెదికారు. తర్వాత పార్క్‌లోని విగ్రహాల ముందు కూర్చున్నారు. ఒకడు తన గన్ని విగ్రహానికి ఆనించి సిగరెట్ వెలిగించి చెప్పాడు.
‘‘పార్క్‌లో లేరు. అయ్యగారు ఇళ్ళల్లోకి వెళ్ళి వెదకమన్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా వెళ్తాం?’’
‘‘నిజమే. పత్రికలు ఇలాంటివి వదలవు. రేపు వాటిలో మనల్ని ఏకాక ఆర్డర్ జారీ చేసిన ఏసీపీ, డీసీపీలు బానే ఉంటారు. మన స్థాయి నించి, సీఐ స్థాయి దాకా సెస్పెండ్ చేస్తారు’’ ఇంకో కానిస్ట్టేబుల్ చెప్పాడు.
ఒంటికి తారు పూసుకుని, యుద్ధ సైనిక విగ్రహాల్లా నిలబడ్డ ఆ ముగ్గురు మిత్రులూ వాళ్ళ మాటలని వింటున్నారు. మర్కట్ మధ్యలో మోకాళ్ళ మీద కూర్చుంటే, అటు ఇటు చూస్తూ అతని పక్కన చేతిలో తుపాకీలు ధరించిన పోజ్‌లో వానర్, కపీష్లు విగ్రహాల్లా నిలబడ్డారు. వానర్‌కి భయంతో... ఆపుకోలేపోయాడు.
‘‘ఏమిటా వాసన?’’ ఓ కానిస్టేబుల్ ముక్కు మూసుకుని అడిగాడు.
‘‘అవును. ఎవరో నంబర్ ఒన్ పోశారు.’’
‘‘ఆ దొంగల్లో ఇది ఎవరో ఒకరి పనై ఉండి ఉంటుంది. సులభ్ కాంప్లెక్స్ గోడ చాటున ఉండి ఉంటాడు. మీరు లోపలకి వెళ్ళండి. నేను గోడ చాటున వెదుకుతాను’’ ఎస్సై ఇద్దరికీ చెప్పి సర్వీస్ రివాల్వర్ని అటువైపు గురి పెట్టి పిల్లిలా నడిచాడు.
అక్కడ తనకి ఆనించి ఉంచి వెళ్ళిన గన్ని మర్కట్ అందుకుని కాల్చడానికి సిద్ధమైన సైనికుడి పోజ్‌లో దాన్ని పట్టుకున్నాడు.
‘‘గన్ని అక్కడ పెట్టేయ్’’ కపీష్ గుసగుసగా చెప్పాడు.
కొద్దిదూరం వెళ్ళాక ఒకడు తన చేతిలో గన్ లేకపోవడం చూసి వెనక్కి వచ్చాడు. మర్కట్ మోకాలికి ఆనించి ఉన్న గన్ని ఆ కానిస్టేబుల్ తీసుకుని వెళ్ళాడు.
(ముగ్గురు మిత్రులు పోలీసుల కంటపడకుండా
ఎలా తప్పించుకున్నారు?)