కూర మిరపతో లాభాల మెరుపు
ఖమ్మం వ్యవసాయం: వివిధ కూరగాయ పంటలతో పాటు కూరమిరప అత్యంత ప్రాచుర్యం పొందింది. దీనిలో క్యాప్సికం(కూర మిరప)ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దీని సాగు పద్ధతులను ఉద్యానశాఖ సహాయ సంచాలకులు-2 కె.సూర్యనారాయణ (83744 49066) వివరించారు.
ఈ క్యాప్సికం కాయలు ఎక్కువ కండ కలిగి గంట ఆకారంలో ఉండటం వలన దీన్ని ‘బెల్ పెప్పర్’ అని కారం లేకపోవడం వలన లేదా తక్కువ కారం ఉండటం వలన ‘స్వీట్ పెప్పర్’ అని అంటారు. ఈ కాప్పికం కాయలలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సి’లు టమాటాలో కన్నా అధికం. మన జిల్లాలో ఏటేటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది.
పంటకు అనువైన సమయం: క్యాప్సికం సాగు చేయటానికి అక్టోబర్- నవంబర్, జూలై- ఆగస్టు నెలలు అనుకూలం.
నేలలు: మురుగు నీరు నిలువ ఉండని నల్లభూములు, ఎర్రభూములు అనుకూలం. ఉదజని సూచిక 6.0 - 6.5 ఉన్న నేలలు బాగా అనుకూలిస్తాయి. చౌడు భూముల్లో ఈ పంట పండించకూడదు.
సాధారణ రకాలు: కాలిపోర్నియా వండర్, ఎల్లో వండర్, అర్కమోహిని (సెలక్షన్-13) లర్కగౌరవ్ (సెలక్షన్-16) అర్కబసంత్ (సెలక్షన్-3), నాంధారి-10, నాంధారి-33.
సంకర జాతి రకాలు: భారత్, మాస్టర్ మాస్టర్, ఇంద్రా, లారియో, ఎస్.ఎస్-436, ఎస్.ఎస్-625, నాథ్ హీరా, తన్వి, విక్రాంత్, గ్రీన్ గోల్డ్, సన్ 1090, సన్ 1058.
విత్తన శుద్ధి: ఎన్నుకున్న రకానికి థైరమ్ లేదా మాంకోజెబ్ 3 గ్రాములు కిలో విత్తనంలో కలిపి విత్తన శుద్ధి చేయాలి.
నారు పెపంకం: ఎత్తై నారుమళ్లు లేదా ప్రొట్రేల ద్వారా నారు పెంచుకోవచ్చు. ప్రోట్రేల ద్వారా నారు పెంచితే దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది.
నాటు విధానం: మొక్కకు, సాళ్లకు మధ్య దూరం 2.5ఁ2.5 అడుగులలో నాటాలి. ఇలా నాటితే ఎకరానికి 8 వేల నుంచి 9 వేల మొక్కలు పడతాయి. రబీ పంటగా 2ఁ2 అడుగుల దూరంలో నాటాలి. ఈ విధానంలో ఎకరాకు 11 వేల నుంచి 12 వేల మొక్కలు పడతాయి.
ఎరువుల యాజమాన్యం: ఎకరానికి 50 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ ఎరువులను పంట పెరిగే వివిధ దశల్లో వేసుకోవాలి.
నీటి యాజమాన్యం: నేల స్వభావాన్నిబట్టి 7-10 రోజుల వ్యవధిలో నీరు కట్టాలి.
{yిప్ పద్ధతిలో నీరు పెట్టేటట్టయితే 10-20 శాతం దిగుబడిలో వృద్ధి పొందటమేగాక నాణ్యమైన కూరగాయలు పొందవచ్చు.
తెగుళ్లు-నివారణ
పంట పెరిగే వివిధ దశల్లో కాయ తొలుచు పురుగు, పై ముడత, కింది ముడత, కాయ ఈగ పురుగు, కోనోఫారా కొమ్మ ఎండు తెగులు, బూడిద తెగులు, కాయ కుళ్లు తెగులు, వైరస్ తెగులు, ఆశించి అపార నష్టాన్ని కలిగిస్తాయి.
పై ముడత నివారణకు లీటర్ నీటిలో 2 మి.లీ రీజెంట్ లేదా 2 మి.లీ డైమిథోయెట్ లేదా 0.2 గ్రాములు ట్రేసర్ పిచికారీ చేయాలి. కింది ముడత నివారణకు లీటర్ నీటిలో 5 మి.లీ డైకోపాల్ లేదా 3 మి.లీ ట్రైజోఫాస్ మందులను మార్చి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు ఆకులు కింద, పైనా తడిచేటట్లు పిచికారీ చేయాలి. మొక్కల్లో సూక్ష్మదాతు లోపాలు కనిపిస్తే తొలి దశలో లీటర్ నీటిలో 3 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, పై సల్ఫేట్, 1.5 గ్రాముల బోరాక్స్, 10 గ్రాముల యూరియా పిచికారీ చేయాలి.
దిగుబడి: నేల స్వభావం, యాజమాన్య పద్ధతులపై దిగుబడి ఆధార పడి ఉంటుంది. మొక్క నాటిన 50-60 రోజుల నుంచి ఉత్పత్తి వస్తుంది. సగటున ఎకరాకు 40-60 క్వింటాళ్ల మేరకు దిగుబడులు వస్తాయి. పంట సాగులో ఆదాయం మార్కెట్ ధరపై గాకుండా రైతులు పొందే దిగుబడులపైనే ఆధారపడి ఉంటాయి. మార్కెట్లో కనీస దర దొరికినా దిగుబడి ఎక్కువపొందటం వలన రైతుకు నికరాదాయం అధికంగా లభిస్తుంది.