స్మార్ట్ సర్వే పూర్తిగాక మంజునాథన్ నివేదిక ఆలస్యం
భీమవరం టౌన్: ప్రజాసాధికర సర్వే పూర్తికాకపోవడంతో మంజునాథన్ కమీషన్ నివేదిక ఆలస్యమైందని కాపు కార్పోరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ పేర్కొన్నారు. కాపులను బిసి జాబితాలో చేర్చే ప్రక్రియకు ప్రజాసాధికార సర్వే రిపోర్టు మంజునాథన్ కమీషన్‌కు అవసరమని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చలమలశెట్టి రామానుజయ మాట్లాడారు. కాపులను బిసి జాబితాలో చే ర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్దితో ఉన్నారన్నారు. బిసిలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని పేర్కొన్నారు. తమిళనాడు, కర్నాటక, కేరళ మాదిరిగా ఇక్కడ బిసిలకు అదనంగా రిజర్వేషన్లు కల్పిస్తారని చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3.70 లక్షల మంది కాపు కార్పోరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకుంటే 50 వేల మందికి రూ.858 కోట్లు రుణాలుగా ఇచ్చామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపు మరో 70 వేల మందికి రుణాలు మంజూరు చేస్తామన్నారు. విదేశాల్లో ఉన్నత చదువుల నిమిత్తం 400 మందిని పంపామన్నారు. సివిల్ సర్వీసెస్‌కు సంబంధించి 500 మందిని చదివిస్తున్నామని తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ చదుదువుతున్న కాపు విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఉపకార వేతనాల పథకం అమలు చేయనున్నామని పేర్కొన్నారు.
పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులను చదివిస్తున్నామని నిరుద్యోగులకు జాబ్ గ్యారంటీ స్కీమ్ కింద రుణ మేళాలు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈ గ్రూపు కింద 3 నుంచి 5 మంది కలిసి పరిశ్రమలు స్థాపించుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద అర్భన్ ఏరియాలో 5 వేల మంది, రూరల్‌లో 10 వేల మంది మహిళలకు మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి, ఆ సమయంలో నెలకు రూ.2వేలు భృతి చెల్లిస్తామన్నారు. శిక్షణ అనంతరం కాపు కార్పోరేషన్ ద్వారా ఉచితంగా ఉపాధి సామాగ్రిని అందచేస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నాయకులు కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.