కాపులను మభ్యపెట్టేందుకే మంజునాథ కమిషన్
అనంతపురం న్యూటౌన్ : కాపు సామాజిక వర్గం ప్రజలను మభ్యపెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మంజునాథ కమిషన్‌ను నియమించిందని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకరరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథిగహంలో విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. కమిషన్ కాపుల సామాజిక పరిస్థితులను వివరిస్తుందే తప్ప రిజర్వేషన్లపై సమీక్షించే అధికారం ఉండదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాపు, బలిజ రిజర్వేషన్లపై గతంలో పుట్టుస్వామి కమిషన్‌తో పాటు అనేక కమిటీలను నియమించారని, అవన్నీ బుట్టదాఖలు చేశారని విమర్శించారు.
కాపు రిజర్వేషన్లను బీసీలు వ్యతిరేకించడం తగదన్నారు. ఆర్థికంగా చితికిపోయిన అన్ని కులాల వారికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆదుకుంటే.. రిజర్వేషన్ల అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇన్ని దశాబ్దాలలో రిజర్వేషన్లు లేని వర్గాల అభివద్ధికి ఎన్ని నిధులు కేటాయించారో ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్రా జయవర్దన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అల్లే మాధవరెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర కార్యదర్శి నరేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.