‘అనుమానితుడు’ అందరితో, అంతటా...
ప్రముఖులతో గిల్హోత్రాకు పరిచయాలు
ముంబై : బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌తో సన్నిహితంగా కనిపించి వార్తల్లోకెక్కిన ‘అనుమానిత బుకీ’ కరణ్ గిల్హోత్రా వ్యవహారాలు చాలా ఉన్నాయి. తాజాగా అతనికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం క్రికెటర్లే కాకుండా దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులతో అతను తరచూ కనిపిస్తుంటాడు. చండీగఢ్‌కు చెందిన కరణ్... ఫైవ్ స్టార్ హోటళ్లలో ఇచ్చే భారీ పార్టీలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రభుత్వాధికారులు తరచుగా హాజరు కావడం అతని పరిచయాల స్థాయిని సూచిస్తోంది. ‘ఈ అనుమానిత బుకీ అన్ని మ్యాచ్‌లకు వెళతాడు. క్రికెటర్లందరితో పరిచయాలు ఉన్నాయి.
పార్టీల్లో కూడా కనిపిస్తాడు’ అని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నివేదికలో కరణ్ గురించి ప్రస్తావన ఉంది. 2012లో ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇచ్చిన పార్టీలో యువరాజ్ సింగ్‌తో అతను దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. 2013లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం బయట పడినప్పుడు కూడా కరణ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అతనిపై ఆరోపణలు వచ్చినా... ఎప్పుడూ కనీస స్థాయిలో కూడా ఆధారాలు లభించలేదు.
అయితే కరణ్ ఇవన్నీ కొట్టి పారేశాడు. ‘అనురాగ్‌తో నాకు పదేళ్లుగా పరిచయం ఉంది. నాకు క్రికెటర్లతో పాటు పలువురు ప్రముఖులు మిత్రులుగా ఉన్నారు. వారితో కలిసి పార్టీల్లో పాల్గొన్నంత మాత్రాన తప్పుడు పనులు చేస్తున్నట్లు కాదు. నేను ఇప్పటికే ఐసీసీకి కూడా లేఖ రాశాను. దమ్ముంటే రుజువు చేయండి’ అని అతను వివరణ ఇచ్చాడు.