టాయ్లెట్లో ప్రసవం.. పరిస్థితి విషమం
సాక్షి,భోపాల్: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. ఎవరూ పట్టించుకోకపోవటంతో ఓ గర్భిణి టాయ్ లెట్ లో ప్రసవించగా, ప్రస్తుతం శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
బాధితురాలి కథనం ప్రకారం.. సుల్తానియా ప్రభుత్వ మహిళా ఆస్పత్రిలో ముస్కన్ అనే ఏడు నెలల గర్భిణిని ఆమె భర్త చికిత్స కోసం చేర్పించారు. గురువారం ఉదయం నొప్పులు రావటంతో విషయాన్ని ఆమె అత్త హీరా బాయ్, ఆన్ డ్యూటీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే అతను ఆ విషయం పట్టించుకోలేదు. నొప్పులు ఎక్కువ కావటంతో చివరకు టాయ్ లెట్లోకి వెళ్లిన ముస్కన్ అతికష్టం మీద బిడ్డను ప్రసవించి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
కోడలు ఎంతకూ రాకపోవటంతో హీరా బాయ్ వెళ్లి చూడగా, బిడ్డ టాయ్లెట్లో పడి ఉన్న విషయం గమనించింది. వెంటనే బిడ్డను దగ్గర్లోని మరో ఆస్పత్రికి తరలించగా, శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సుల్తానియా ఆస్పత్రి సిబ్బందిని నిలదీస్తే తనని బయటకు గెంటేశారని బాధితురాలి అత్త చెబుతున్నారు.
అంతా ఆరోపణలే..
నెలలు నిండకుండానే మస్కన్ ప్రసవించిందని, అందుకే శిశువు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి సూపరిండెంట్ కరణ పీప్రె చెబుతున్నారు. వైద్యులపై, సిబ్బందిపై బాధితులు చేస్తున్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు.