పండుగపూట పస్తులుండాల్నా..?
తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్‌కోట్ శివారులో ఉన్న సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఫ్యాక్టరీ ఎదుట కాంట్రాక్టు కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు. దసరా పండుగకు సంబంధించి కంపెనీ యజమాన్యం బోనస్ చెల్లించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలో మొత్తం 400 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు.
దసరా పండుగ సందర్భంగా యజమాన్యం బోనస్ చెల్లించాలని కార్మికులు కోరగా యజమాన్యం నిరాకరించింది. కాంట్రాక్టు కార్మికులకు 6 నెలలకు ఓసారి ఇచ్చే డీఏ కూడా ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపించారు. బోనస్ చెల్లించకపోతే పండుగపూట పస్తులుండాల్నా..? అని జీఎం శ్రీవాస్తావను కంపెనీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
యజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు కంపెనీ ఎదుట వంటవార్పు నిర్వహించారు. యజమాన్యం దిగివచ్చే వరకు ఆందోళన ఆపబోమని కార్మికులు స్పష్టం చేశారు. కార్మికుల ఆందోళనకు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హేమంత్‌కుమార్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికుల సంఘం నాయకులు జంగయ్య, గౌసొద్దీన్, శంకర్, సుధాకర్, రూప్సింగ్ తదితరులున్నారు.