Karate training
-
వృత్తి పొగాకు వ్యాపారం.. ప్రవృత్తి కరాటే మాస్టర్
సాక్షి, కొత్తకోట రూరల్: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. చిన్నపాటి డబ్బాలో పొగాకు అమ్ముకుంటూ కరాటేలో ప్రతిభకనబర్చి ఉన్నతస్థాయి వ్యక్తుల నుంచి మన్ననలు పొందుతున్న ఓ నిరుపేద యువకుడు అబ్దుల్నబీ. కొత్తకోట పట్టణ కేంద్రానికి చెందిన సుల్తాన్‌బీ, ఖాజామియ్యా దంపతుల కుమారుడు అబ్దుల్ నబీ చిన్నప్పుడు సరదాగా పంచ్‌లు విసిరిన చేతులే నేడు పట్టెడన్నం పెడుతున్నాయి. ఓ పేదింటి యువకుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రశంసలు పొందుతున్నాడు. నబీ తల్లి బీడీ కారి్మకులు కాగా తండ్రి పొగాకు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుండేవారు. తాను నేర్చుకున్న విద్య నలుగురికి నేర్పుదామని 2015లో ‘గాడ్స్ ఆన్ వారియర్స్ షోటోఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ అకాడమీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అకాడమీలో 500 మంది విద్యార్థులు కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది విద్యార్థులు తన దగ్గర శిక్షణ తీసుకున్నట్టు నబీ తెలిపాడు. ఇక్కడ శిక్షణ తీసుకున్న విద్యార్థులు తక్కువ కాలంలోనే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని పలుమార్లు బంగారు, వెండి పతకాలు సాధించారు. తన దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థులు పోలీస్, ఆర్మీ, సీఆర్పీఎఫ్ తదితర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు ప్రైవేట్ పాఠశాలల్లో పీఈటీలుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక పోటీల్లో పతకాలు అందుకున్నాడు. ఒలింపిక్స్‌లో ఆడించడమే లక్ష్యం నేను నేర్చుకున్న కరాటేలో అన్నిస్థాయిల్లో మంచి ప్రతిభకనబర్చుతూ మేధావుల నుంచి ప్రశంసలు పొందిన అబ్దుల్నబీ రాబోయే రోజుల్లో తన అకాడమీ విద్యార్థులను ఒలింపిక్ క్రీడల్లో ఆడించడమే నా లక్ష్యం. ప్రభుత్వం కరాటేను ఆదరించి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కరాటే నేరి్పంచేందుకు మాలాంటి వారికి ఉద్యోగావకాశాలు కలి్పంచాలి. – అబ్దుల్నబీ, కరాటే మాస్టర్, కొత్తకోట -
మగువలకు తెగువ పాఠాలు
ఆకాశంలో సగభాగమైన మగువలు పారిశ్రామిక, ఉద్యోగ, వ్యాపార, వైమానిక, విద్యారంగాల్లో తమ సత్తాను చాటుతూ అన్నింటా పురుషులకు దీటుగా నిలుస్తున్నారు. అయినా సరే, ఢిల్లీ నుంచి గల్లీ వరకు మగువలకు తగిన రక్షణ లేక మృగాళ్ల చేతుల్లో హత్యాచారాలకు గురవుతున్నారు. గృహిణుల మెడల్లో చైన్లను పట్టపగలే తెంపుకెళ్లిపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయులవుతున్నారు. మగవారి కంటే శారీకంగా మహిళలు తక్కువ బలాన్ని కలిగి ఉంటారు. ఆ బలహీనతనే ఆసరాగా చేసుకుని కొందరు దుర్మార్గులు వారి జీవితాలను కాలరాచేందుకు సైతం వెనుకాడరు. ఇలాంటి సందర్భాల్లో కనీసం ప్రత్యర్ధిని ఏమీ చేయలేకపోయినా ధైర్యంతో తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఊరూరూ తిరుగుతూ వారికి కరాటేను నేర్పుతున్నారు కొడాలి రవిబాబు, సాగరిక దంపతులు. విజయవాడలో కరాటే శిక్షణను ఇచ్చే రవిబాబును ఏపీలోనే తొలి ఇన్‌స్ట్రక్టర్‌గా 2014లో జపాన్ కరాటే అసోసియేషన్ వారు గుర్తించి ధ్రువపత్రాన్ని అందించారు. సాగరిక గన్నవరంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా పని చేస్తూ... తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ మహిళల ఆత్మరక్షణకు కరాటేను నేర్పుతున్నారు. దానితోపాటు ప్రజలలో మూఢనమ్మకాలను పారదోలటానికి అవగాహనా శిబిరాలను నిర్వహిస్తున్నారు. ‘‘మహిళలపై దాడులు ఢిల్లీ తర్వాత విజయవాడలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. 2012లో నిర్భయ హత్య జరిగినపుడు మచిలీపట్నంలో 60మంది ఆడపిల్లలకు కరాటేపై శిక్షణా శిబిరం నిర్వహించాం. అదే ఈ ఉచిత కరాటే శిక్షణాశిబిరాలకు ఆరంభం. అమ్మాయిలను అనుసరిస్తూ, వారిని కామెంట్ చేయడమే పనిగా పెట్టుకుంటారు కొందరు ఆకతాయిలు. వారికి భయపడితే అదే ఆసరాగా తీసుకుని మరో అడుగు ముందుకేస్తారు. చైన్స్నాచర్లయితే, మహిళల మెడలో నుంచి చైన్లను బలవంతంగా లాగేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ధైర్యంగా ఉంటే కనీసం ఆత్మరక్షణ చేసుకోవచ్చు. అందుకోసం కరాటేలో కొన్ని మెళకువలు ఉన్నాయి. వాటినే క్యాంప్‌ల ద్వారా ఊరూరా నేర్పుతున్నాం. అలాగే చేతబడి, బాణామతి, చిల్లంగి వంటివాటిపై ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలను పారద్రోలేందుకు అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు రవిబాబు, సాగరిక దంపతులు. వారి ప్రయత్నాలు నెరవేరాలని ఆశిద్దాం. - అయికా రాంబాబు సాక్షి, గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా) -
గిరిజన బాలికలకు స్కూళ్లలో కరాటే శిక్షణ
గిరిజన బాలికలు తమకు ఎదురయ్యే ఆపదల నుంచి తమను తాము రక్షించుకోడానికి వీలుగా వారికి కరాటే శిక్షణ అందించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వాళ్లు చదువుకునే స్కూళ్లలోనే ఈ శిక్షణ ఇస్తారు. ముందుగా గిరిజన జనాభా ఎక్కువగా ఉండే నీలగిరి, నమక్కల్, సేలం, తిరువన్నామలై, ధర్మపురి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి కేసీ వీరమణి అసెంబ్లీలో తెలిపారు. 482 పాఠశాలల్లో చదువుతున్న 4,782 మంది అమ్మాయిలకు రూ. 14 లక్షల ఖర్చుతో ప్రాథమికంగా శిక్షణ ఇస్తారు. మరోవైపు, 2014-15 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా పరికరాల కొనుగోళ్లకు రూ. 20 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
ఆత్మరక్షణ కోసం బాలికలకు కరాటేలో శిక్షణ
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : ఢిల్లీలో వైద్య విద్యార్థిని నిర్భయపై జరిగిన లైంగికదాడి, హత్య నేపథ్యంలో పిల్లలను బోధనకు పంపించాలంటే తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో చదువుతోపాటు ఆత్మరక్షణ కోసం బాలికలు కరాటేలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రాథమిక, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బాలికలకు శిక్షణ ఇవ్వాలని సన్నాహాలు చేస్తుందని మంత్రి ప్రకటనలో స్పష్టమైంది. కాగా, జిల్లావ్యాప్తంగా 2,911 ప్రాథమిక, 412 ప్రాథమికోన్నత, 387 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2 లక్షలకుపైగా విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. బాలికలకు కరాటేలో శిక్షణ ఇవ్వాలంటే బాధ్యతను వ్యాయామ ఉపాధ్యాయులకు అప్పగించాలి. కానీ, వ్యాయామ ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారు. ఈ పోస్టులను భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం లేదు. లేకపోతే కాంట్రాక్ట్ పద్ధతిన కరాటే మాస్టర్లను అయినా నియమించాలి. ఏ విధంగా అమలు చేస్తుందో వేచిచూడాల్సిందే. జెడ్పీహెచ్ఎస్లలో కొంతకాలం అమలు గతంలో ప్రభుత్వం జిల్లా పరిషత్ పాఠశాలల్లో బాలికలకు కరాటేలో శిక్షణ ఇప్పించింది. అయితే ఎంపిక చేసిన 75 జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల్లో మాత్రమే అమలు చేసింది. 2012 నుంచి ఏప్రిల్ 2013 వరకు రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) కింద కరాటే శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వమే కరాటే దుస్తులు సరఫరా చేసింది. ప్రైవేటుగా కరాటేలో నిష్ణాతులైన మాస్టర్లను శిక్షకులుగా నియమించింది. మండలానికి ఒకరు చొప్పున నియామకం చేసింది. రోజు ఒక పాఠశాలలో కరాటే శిక్షణ ఇచ్చారు. ప్రతినెలా వారికి రూ.4 వేలు గౌరవ వేతనం ఇచ్చేవారు. అనంతరం గత ఏప్రిల్ మాసంలో కరాటే శిక్షకులను ప్రభుత్వం తొలగించింది. మళ్లీ వారిని విధుల్లోకి తీసుకోలేదు. కరాటేతో లాభాలు.. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లిన మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రోజు బాలికలు, యువతులపై లైంగికదాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. పాఠశాలకు వెళ్లే బాలికలకు, కళాశాలకు వెళ్లే విద్యార్థినులకు, ఉద్యోగానికి వెళ్లే మహిళలు ధైర్యంగా కాలు బయట పెట్టలేని దుస్థితి. ఈ క్రమంలో పాఠశాల స్థాయి నుంచి బాలికలకు కరాటేలో శిక్షణ ఇస్తే వారిలో ఆత్మస్థైర్యం పెరిగే అవకాశం ఉంది. తమకు తాము రక్షించుకోవచ్చనే ధైర్యం ఏర్పడుతుంది. ఇంకా కరాటే సాధనతో ఆరోగ్యంతోపాటు, ఆత్మరక్షణ , జ్ఞాపకశక్తి, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలననే ధైర్యం వస్తుంది. యోగాలో కూడా తర్ఫీదు ఇవ్వడంతో శరీరానికి అలసటనేది ఉండదు. చురుకుగా ఉంటారు. చదువులో కూడా రాణిస్తారు.