ఆ పార్సిళ్లను వెనక్కి పంపుతున్న పాక్
డామన్: పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న భారత జాలర్లకు వారి బంధువులు పంపుతున్న పార్సిళ్లను ఆ దేశ జైళ్ల అధికారులు వెనక్కి పంపుతున్నారు. గత 9 నెలల్లో సరిహద్దు జాల్లాలో పట్టుబడిన.. గుజరాత్‌కు చెందిన 438 మంది, డయ్యూకు చెందిన 51 మంది జాలర్లు పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్నారు. లేఖలు, ఆహార పదార్థాలు, దుస్తులు, మందులు తదితరాలను కరాచీ జైళ్లలోని జాలర్లకు బంధువులు పంపేవారు. అధికారులు కూడా వాటిని జాలర్లకు అందజేసేవారు.
అయితే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో భారత్ సర్జికల్ దాడులు అనంతరం.. ఇలాంటి పార్సిళ్లను వెనక్కి పంపిస్తున్నారని డయ్యూ మత్స్య శాఖ అధికారి శుకర్ అంజనీ తెలిపారు. తాము పంపిస్తున్న పార్సిళ్లు తిరిగి వస్తున్నాయని మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. వీటిపై కరాచీ జైలు స్టాంప్ కూడా ఉండడంతో పాకిస్థాన్ వెళ్లిన తర్వాతే పార్సిళ్లు తిరిగివస్తున్నట్టు గుర్తించామని వెల్లడించారు.