బుడతడి ఆర్ట్‌కి అధ్యక్షుడు ఫిదా
లాగోస్(నైజీరియా) : 11 ఏళ్ల నైజిరియా బుడతడు గీసిన చిత్రానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఫిదా అయ్యారు. నైజీరియాలో రెండు రోజు పర్యటనలో భాగంగా మాక్రాన్ లాగోస్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నైజీరియా చిన్నారి కరీమ్ వారిస్ ఒలామిలేకన్ గీసిన తన చిత్రాన్ని చూసుకొని మాక్రాన్ మురిసిపోయారు. చిత్రాన్ని గీసిన కరీమ్‌ను ప్రేమతో దగ్గరకు తీసుకొని వెన్ను నిమిరి మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
కరీమ్ కేవలం రెండు గంటల్లోనే మాక్రాన్ చిత్రాన్ని గీశాడు. మాక్రాన్ ఈ విషయాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. బుడతడి నైపుణ్యం తన మనస్సుకు హత్తుకుందని అతనికి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పిటిన తర్వాత తొలిసారి మాక్రాన్ నైజిరియాలో పర్యటించారు. ఆఫ్రికా లెజెండరీ మ్యూజీషియన్ ఫెలా కుటి స్మారకార్థం లాగోస్‌లో నిర్మించిన నైజీరియా నైట్ క్లబ్‌ను సందర్శించారు.