రాష్ట్రంలో రైతు భరోసా యాత్ర
రైతుల ఆత్మహత్యలను నివారిద్దాం: కోదండరాం
హైదరాబాద్ : సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని, అందరం కలసికట్టుగా పనిచేసి రైతులను బతికించుకోవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా యాత్రను చేపడుతున్నామని, రైతుల ఆత్మహత్యలను నివారించడానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నామని ప్రకటించారు. శనివారం నాంపల్లిలోని 21 సెంచరీ బిల్డింగ్‌లో జరిగిన తెలంగాణ రాజకీయ జేఏసీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం కార్యాలయాన్ని ప్రారంభించి ప్రసంగించారు.
ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న జేఏసీ కార్యాలయాన్ని నాంపల్లికి మార్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి నారాయణ, జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎ.శ్రీధర్, హైదరాబాద్ జిల్లా నాయకుడు ఎంబీ కృష్ణయాదవ్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.