'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు'
న్యూఢిల్లీ: మౌనం పదునైన ఆయుధం, మౌన మంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ద సంభాషణ అన్నాడు ఓ పెద్దాయన. నిశ్శబ్దాన్నే ఆయుధంగా చేసుకుని పాలకులపై పదునైన ప్రశ్నలు ఎక్కుపెట్టింది ఓ అమరవీరుడి కుమార్తె. పంజాబ్ లోని జలంధర్ కు చెందిన 19 ఏళ్ల గుర్ మెహర్ కౌర్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసిన నిశ్శబ్ద వీడియో చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లీషులో సందేశం రాసివున్న 30 ప్లకార్డులను ప్రదర్శించింది. భారత్-పాకిస్థాన్ శాంతి నెలకొనాలని ప్రగాఢంగా ఆకాంక్షించింది.
1999లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో తన తండ్రి కెప్టెన్ మణ్ దీప్ సింగ్ వీర మరణం పొందేనాటికి తనకు రెండేళ్లు అని తెలిపింది. తన చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఆయనతో గడిపే అవకాశం లేకుండా పోయిందని వాపోయింది. తన తండ్రి కారణమైందని పాకిస్థాన్ ను, అక్కడి ప్రజలను(ముస్లింలను) వ్యతిరేకించానని వెల్లడించింది. ఆరేళ్ల వయసులో బురఖా వేసుకుని వచ్చిన మహిళ తనపై హత్యాయత్నం చేసిందని గుర్తు చేసుకుంది. తన తండ్రి చావుకు ఆమే కారణమన్న అనుమానం కూడా కలిగిందని చెప్పింది.
అయితే తండ్రి మరణానికి పాకిస్థాన్ కారణం కాదని, యుద్ధం వల్లే ఆయన తమకు దూరమయ్యాడని తన తల్లి వివరించడంతో రియలైజ్ అయినట్టు పేర్కొంది. తన తండ్రిలాగే సైనికుడిగా పోరాడుతున్నానని, భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి కోసం పోరుబాట పట్టానని వెల్లడించింది. రెండు దేశాల ప్రభుత్వాలు పంతాలకు పోకుండా సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలని విజ్ఞప్తి చేసింది. రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ఫ్రాన్స్, జర్మనీ మిత్రులుగా మారాయని.. జపాన్, అమెరికా గతం మర్చిపోయి అభివృద్ధి పథంలో సాగుతున్నాయని గుర్తు చేసింది. అలాంటప్పుడు భారత్-పాకిస్థాన్ ఎందుకు చేతులు కలపకూడదని ప్రశ్నించింది.
రెండు దేశాల్లోని సామాన్య ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, యుద్ధాన్ని కాదని స్పష్టం చేసింది. ఇరు దేశాల పాలకుల నాయకత్వ పటిమను పశ్నిస్తున్నానని, అసమర్థ నాయకుల పాలన ఉండాలని కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. బేషజాలను పక్కన పెట్టి చర్చలు జరపాలని, పరిష్కారం కనుగొనాలని కోరింది. తీవ్రవాదానికి, గూఢచర్యానికి, విద్వేషాలకు పాల్పడవద్దని రెండు దేశాలకు విజ్ఞప్తి చేసింది. సరిహద్దులో మారణహోమం ఆగాలని కౌర్ ఆకాంక్షించింది.