రెండో విడతపై మడత పేచీ
* రుణమాఫీ సొమ్ము విడుదలలో సర్కారు జాప్యం
* సగం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్న వైనం
* రైతులకు ఖరీఫ్ రుణాలిచ్చేందుకు బ్యాంకుల విముఖత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్కారు తీరుతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. రెండో విడత రుణమాఫీ సొమ్ములో సగం మాత్రమే విడుదల చేసి మిగిలిన సగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. రెండో విడత రూ.4,086 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా.. రూ.2,043 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన మొత్తం ఎప్పుడు విడుదల చేస్తారో ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో బ్యాంకులు రైతులకు పూర్తిస్థాయిలో కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ఫలితంగా పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు దిక్కులు చూస్తున్నారు.
ప్రైవేటు అప్పులే దిక్కు..
తెలంగాణ ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. రూ.17 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. 35.82 లక్షల రైతు ఖాతాలను గుర్తించింది. మొదటి విడతగా గత ఏడాది రూ.4,230 కోట్లు రుణ మాఫీ ప్రకటించింది. ఆ మొత్తం జిల్లాల్లోని బ్యాంకులకు అందజేసింది. ఆ సొమ్ములో బ్యాంకులు ఇప్పటివరకు రూ.4,086.22 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. రెండో విడతకు కొర్రీ పెట్టింది. మాఫీ సొమ్ము సగమే విడుదల చేసినందున రైతులందరికీ రుణాలివ్వలేమని బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి. చేసేది లేక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.