నగర పంచాయతీ ఎదుట అఖిలపక్షం ధర్నా
తీర్మానానికి చైర్మన్ కట్టుబడాలన్న నాయకులు
హుస్నాబాద్ మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కొనసాగించాలని నగర పంచాయతీ పాలకవర్గం చేసిన తీర్మానానికి చైర్మన్ సుద్దాల చంద్రయ్య కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ బుధవారం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. హుస్నాబాద్‌ను కరీంనగర్‌లోనే కొనసాగించాలని నగర పంచాయతీలో తీర్మానం చేసిన చైర్మన్.. టీఆర్ఎస్ పార్టీ సమావేశాల్లో మాత్రం సిద్దిపేటలో కలపాలని మాట్లాడడం సరికాదన్నారు. మండలంలోని మెజార్టీ గ్రామాలు కరీంనగర్‌లోనే కొనసాగించాలని తీర్మానాలు చేసి అధికారులకు పంపించాయన్నారు. చైర్మన్ బయటకు రావాలని నినాదాలు చేశారు. నగరపంచాయతీ కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. చైర్మన్ చంద్రయ్య బయటకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రజలకు ఏది ఆమోదయోగ్యంగా ఉంటే అదే చేస్తామన్నారు. ఒకసారి తీర్మానించాక పునరాలోచించబోమని స్పష్టం చేశారు. దీంతో నాయకులు ఆందోళన విరమించారు. ధర్నాలో సింగిల్‌విండో డైరెక్టర్ అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు అయిలేని శంకర్‌రెడ్డి, బొల్లి శ్రీనివాస్, మైదంశెట్టి వీరన్న, పచ్చిమట్ల రవీందర్, అక్కు శ్రీనివాస్, పచ్చిమట్ల సంపత్, బీజేపీ నాయకులు విజయపాల్‌రెడ్డి, ఆడెపు లక్ష్మినారాయణ, వేముల దేవేందర్‌రెడ్డి, విద్యాసాగర్, అనిల్, వరయోగుల అనంతస్వామి, టీడీపీ నాయకులు వరయోగుల శ్రీనివాస్, ముప్పిడి రాజిరెడ్డి, సీపీఐ నాయకులు మాడిశెట్టి శ్రీధర్, జగన్నాధం తదితరులున్నారు.